AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. నెల్లూరు జిల్లా తడ నుంచి.. శ్రీకాకుళం జిల్లా దొంకూరు వరకు దాదాపు 974 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ప్రకృతి మది దోచుకునే విధంగా తీరం ఉంటుంది. తీరం ఉన్న జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తీర ప్రాంతాలు చిగురుటాకుల వణికి పోతాయి. చిన్నపాటి వర్షాలకి తడిసి ముద్దవుతాయి. తుఫాన్లు అంటే బెంబేలెత్తిపోతాయి.
బంగాళాఖాతంలో తుఫానుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదు దశాబ్దాలలో రాష్ట్రంపై దాదాపు 60 తుపానులు ప్రభావం చూపాయి. వాటిలో 36 కు పైగా తీవ్ర, అతి తీవ్రత తుఫాన్ లే. ఒక్క నవంబరు డిసెంబర్ నెలలో 25 తుఫాన్లు ఏర్పడడం గమనార్హం. తాజా మిగ్ జాం తుఫాను నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలపై ప్రభావం చూపింది. భవిష్యత్తులో మరిన్ని తీవ్ర తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం,జలాలు ఉప్పొంగడం వల్ల భవిష్యత్తులో తీరప్రాంతాలకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా తుఫాన్లు తీరాన్ని దాటడానికి అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ వరకు అనుకూల కాలం. అయితే తుఫాన్లు ఇంతటి విధ్వంసం సృష్టించడానికి కారణం.. వాటికి అడ్డంగా ఉన్న మడ అడవులు నరికి వేయడమే. తుఫాన్లతోపాటు సునామీలను ఎదుర్కొనే సత్తా ఒక్క అడవులకే ఉంది. అటువంటి అడవులనే తొలగించడం మానవుడికి ముప్పే. పూడిమడక, కాకినాడ, ప్రకాశం జిల్లాలో మడ అడవులను తొలగించడం దారుణం. భవిష్యత్తులో ఏపీకి తుఫానుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తీరం వెంబడి పటిష్ట చర్యలు చేపట్టకపోతే అది మానవ మనుగడకే ముప్పు. నాలుగు దశాబ్దాల కిందట సంభవించిన దివిసీమ తుఫాను నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. ఎన్నో రకాల చర్యలకు ఉపక్రమించాం.కానీ వాటిని కొనసాగించలేకపోతున్నాం. ఇది విచారకరం.