Fake Votes In AP: దొంగఓట్లనమోదు, అర్హుల ఓట్ల తొలగింపు.. తాడేపల్లి కుట్ర బయటపెట్టిన టీడీపీ

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ తరుణంలో అధికార వైసిపి దొంగ ఓట్లతో గెలవాలని భావిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

Written By: Dharma, Updated On : August 22, 2023 6:21 pm

Fake Votes In AP

Follow us on

Fake Votes In AP: ఏపీలో ప్రస్తుతం దొంగ ఓట్ల నమోదు కలకలం సృష్టిస్తోంది. ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది అధికారులు వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో 6000 దొంగ ఓట్లు చేర్పించారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ సీఈవో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో ఓట్ల నమోదు,తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా టిడిపి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమ పర్వానికి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రమని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ తరుణంలో అధికార వైసిపి దొంగ ఓట్లతో గెలవాలని భావిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓట్లు లేవని.. మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికి ఓటు నుంచి మిగతా అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సున్నా డోర్ నెంబర్తో దొంగ ఓట్లు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండ నియోజకవర్గం లో దొంగ నోట్ల వ్యవహారం నడుస్తోందని స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గత ఏడాదిగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఏకంగా ఎన్నికల సంఘానికి ఆయన పలుమార్లు ఫిర్యాదు చేయడంతో.. అక్కడ జడ్పీ సీఈఓ పై వేటు వేశారు. దీంతో దొంగ ఓట్ల నమోదు నిజమేనని తేలింది. ఏపీలో 20 లక్షల దొంగ ఓట్లు గుర్తించినట్లు టిడిపి ఆరోపిస్తోంది. ప్రధాన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఈ అక్రమాల పర్వం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఓట్ల అక్రమాలపై టిడిపి శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు స్పందించారు. విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల అక్రమాల కోసం తాడేపల్లి ప్యాలస్ ని వేదికగా చేసుకుని 800 మంది పని చేస్తున్నారని ఆరోపించారు. ఓ పారిశ్రామికవేత్త పర్యవేక్షణలో ఈతతంగం జరుగుతోందని ప్రకటించారు. టిడిపి కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలనే టార్గెట్ చేసుకొని అక్రమాల పర్వానికి దిగారని ఆయన ఆరోపించారు. ఫారం 7 తో ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపునకు దిగుతున్నారని.. అందుకే టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు చంద్రబాబు ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిషన్ కు కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సైతం ఓట్ల తొలగింపు పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఇతర విపక్షాల సైతం ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓట్ల తొలగింపు వ్యవహారం పెను దుమారానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.