
ఆంధ్రప్రదేశ్ ఓ పక్క అప్పుల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనిలో ప్రబుద్దులు పడిపోయారు. అందినంత దోచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజాధనాన్ని కొల్గొడుతూ తమ ఖజానా నింపుకుంటున్నారు. సీఎంఎఫ్ఎస్ విధానంలో కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని రిజిస్రార్లు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలోనే ఈ కుంభకోణం వెలుగు చూడడం గమనార్హం.
తరువాత అన్ని జిల్లాల్లోనూ తీగ లాగితే డొంక కదిలినట్లుగా స్కాం బయటపడడంతో విచారణకు ఆదేశించారు. రిజిస్రేషన్ డాక్యుమెంట్లలో 770 వరకు నకిలీ చలాన్లతో మోసం చేసినట్లుగా గుర్తించారు. దీంతో రూ 5 కోట్ల ప్రజాధనం లూటీ అయినట్లు తెలుస్తోంది. అసలే ప్రభుత్వం కష్టాల్లో ఉండగా ప్రభుత్వ ధనాన్ని అడ్డదారుల్లో దోచుకోవాలని ప్రయత్నిస్తున్న అక్రమార్కుల పని పట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు సబ్ రిజిస్రార్లను సస్పెండ్ చేశారు. కేసును సీఐడీకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవడం లేదు.
సబ్ రిజిస్రార్ కార్యాలయాలు అవినీతికి చిరునామాలుగా మారిపోయాయి. అధికారులైతే అందినకాడికి దోచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం కాస్త పక్కదారి పట్టడంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు రిజిస్రార్లు తెగించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వం పరువు పోతుందని భావిస్తే భవిష్యత్ లో మరిన్ని పెద్ద కుంభకోణాలు జరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
సందట్టో సడేమియాగా సబ్ రిజిస్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న తంతుపై ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది. ప్రభుత్వానికే టోకరా వేస్తూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న అధికారుల తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. అధికారుల్లో అసలు భయం లేకుండా పోతోందని చెబుతున్నారు. అందుకే ఇంతటి భారీ స్కాంకు తెర తీసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది.