https://oktelugu.com/

Andhra University: మసకబారుతున్న ఏయూ ప్రతిష్ట.. వైసీపీ నేతలా వ్యవహరిస్తున్న వైస్‌ చాన్సలర్‌

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ..సుదీర్ఘ చరిత్ర కలిగిన అత్యున్నత విద్యాసంస్థ. ఇక్కడ చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ఉన్నత రంగాల్లో కొలువుదీరారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది ఈ యూనివర్సిటీ. ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతుంటారు. క్యాంపస్ లో అడుగుపెడితే తమ భవిష్యత్ మారిపోతుందని కలలు కంటారు. అటువంటి విద్యాసంస్థ చరిత్ర మసకబారే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఏయూ ప్రతిష్ఠను మంటగలిపేలా ప్రస్తుత పాలకుల చర్యలు, నిర్ణయాలున్నాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. […]

Written By:
  • Dharma
  • , Updated On : June 4, 2022 / 10:53 AM IST
    Follow us on

    Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ..సుదీర్ఘ చరిత్ర కలిగిన అత్యున్నత విద్యాసంస్థ. ఇక్కడ చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ఉన్నత రంగాల్లో కొలువుదీరారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది ఈ యూనివర్సిటీ. ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతుంటారు. క్యాంపస్ లో అడుగుపెడితే తమ భవిష్యత్ మారిపోతుందని కలలు కంటారు. అటువంటి విద్యాసంస్థ చరిత్ర మసకబారే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఏయూ ప్రతిష్ఠను మంటగలిపేలా ప్రస్తుత పాలకుల చర్యలు, నిర్ణయాలున్నాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రధాన వైస్ చాన్స్ లర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది.

    Andhra University

    ఆయన అధికార పార్టీ నేత తరహాలో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం వీసీ కార్యాలయంలో కనిపిస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే వీసీ చాంబర్‌ నగరంలో అనధికారికంగా వైసీపీ రెండో కార్యాలయంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఉప కులపతిగా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రసాద్‌రెడ్డిని అభినందించేందుకు, శాలువాలతో సత్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పోటీపడ్డారు. ఈ ప్రక్రియ సుమారు రెండు నెలలపాటు కొనసాగింది. దీనిని బట్టి అధికార పార్టీ నేతగా వీసీ ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారో ఇట్టే అవగతమవుతుంది. గతంలోనూ కొందరు వైస్‌ చాన్సలర్లు అధికార పార్టీ పట్ల కాస్త సానుకూలత ప్రదర్శించిన సందర్భాలున్నప్పటికీ ఎక్కడా బయటపడేవారు కాదు. ఈ స్థాయిలో వీసీ చాంబర్లోనే రాజకీయాలు నెరపడం, నాయకులను ఆహ్వానించి, వారితో చర్చించడం లాంటి చర్యలకు దిగజారలేదని వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్లే పేర్కొంటున్నారు.

    Also Read: Pawan Kalyan: ఎన్నికల ముందర పవన్ కళ్యాణ్ బ్రహ్మస్ట్రం..?

    గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం వీసీ ప్రసాదరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నేరుగా అధికార పార్టీకి పనిచేశారని విపక్షాలు ఆరోపించాయి. జీవీఎంసీ ఎన్నికల్లో తెరవెనుక మంత్రాంగంజీవీఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం కోసం వీసీ ప్రసాదరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలోనూ ఆయన పాత్ర ఉందని, ఇందులో భాగంగా పార్టీ ముందుగా సిద్ధం చేసిన జాబితాలోని పేర్లను చివరి నిమిషంలో మార్చారని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. విజయం సాధించే అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులతో రహస్య సర్వే చేయించి, ఆ మేరకు జాబితాను సవరించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇందులో భాగంగా తన ఆప్తులకు టిక్కెట్లు దక్కేలా వీసీ వ్యవహరించారనే ప్రచారమూ జరిగింది. దీంతో పాటు అధికార పార్టీ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. అలాగే రెడ్డి సామాజికవర్గం నిర్వహించిన ఓ సమావేశ వేదికపై వీసీ కూర్చోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

    Andhra University

    వీసీగా ప్రసాద్‌రెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పటికీ తీసుకుంటున్నారు. వీటిలో అత్యంత కీలకమైనది రిజిస్ట్రార్ కృష్ణమోహన్‌ నియామకం. ఆయనకు ఉద్యోగ విరమణానంతరం రెండు రీ అపాయింట్‌మెంట్లు ఇప్పించడంతో పాటు కీలకమైన రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించారు. ఏపీ యూనివర్సిటీ యాక్ట్‌-1991, ఏపీ కోడ్‌ వాల్యూమ్‌ ప్రకారం రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏడాదికి మించి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకూడదు. కానీ, కృష్ణమోహన్‌కు రెండుసార్లు కొనసాగింపు ఉత్తర్వులతో పాటు పాలనాపరమైన బాధ్యతల్లో నియమించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులైన 15 మందిని వర్సిటీ గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి పాలనతో సంబంధమున్న బాధ్యతలను అప్పగించకూడదన్న నిబంధనను పట్టించుకోకుండా తనకు విధేయులైన ఎంతోమందిని ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, డీన్లుగా నియమించారు.

    ఏయూ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన విషయం ఇటీవల వెలుగుచూసింది. వర్సిటీలోని కొన్ని ప్రాంతాలను చదునుచేసే పనులు చేపట్టడంతో ఈ బాగోతం బయటపడింది. ఇది వర్సిటీ ప్రతిష్ఠను అధః పాతాళానికి దిగజార్చింది. చెట్లు తొలగించే పనులు చేపట్టిన ఓ ప్రాంతంలో వందలాది కండోమ్‌ ప్యాకెట్లు, వేలాది బీర్‌ బాటిళ్లు లభించాయి. అక్కడ వ్యభిచారం నిర్వహించుకునేందుకు వీలుగా చెట్లపై ఏర్పాటుచేసిన పాన్పులు కనిపించాయి. అయితే ఈ ఫొటోలను వర్సిటీ అధికారులే స్వయంగా మీడియాకు విడుదల చేయడం విశ్వవిద్యాలయంపై వారికున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తోంది. సరస్వతి నడయాడాల్సిన ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందంటే.. దాని వైఫల్యం ఎవరిదో ఇట్టే అవగతమవుతుంది. ఇలాంటి చర్యలతో వర్సిటీ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మసకబార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఉప కులపతి పదవిలో ఉన్న వ్యక్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ, కులపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. విశ్వవిద్యాలయం ప్రమాణాలు పెంపొందించేందుకు కృషిచేయాలి. కానీ ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ నిబంధనలేవీ పట్టించుకోకుండా రాజకీయ కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    యూనివర్సిటీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. డీజే సౌండ్‌ సిస్టమ్‌లు, బాణసంచా మోతలతో వర్సిటీని మోతెక్కించి, స్వయంగా వీసీ ప్రసాదరెడ్డి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. తన సమక్షంలోనే సీఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నిర్వహించడం విమర్శలకు తావిచ్చినా, ఆయన పట్టించుకోలేదు. జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రసాదరెడ్డి తన చాంబర్‌లోనే కేక్‌ కట్‌ చేసి సహ ఉద్యోగులతో కలిసి సంబరాలు జరుపుకొన్నారు. ఇక ఎయిడెడ్‌ అధ్యాపకులను యూనివర్సిటీల్లోకి తీసుకునే ప్రతిపాదనల దశలోనే ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో ఎయిడెడ్‌ అధ్యాపకులను తీసుకునేందుకు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలు ఆలోచనలో పడ్డాయి. అయితే కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా వీసీ ప్రసాద్‌రెడ్డి సుమారు 90 మంది అధ్యాపకులను ఏయూలోకి తీసుకున్నారు. దీనిని వర్సిటీ కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీ తీవ్రంగా వ్యతిరేకించినా ప్రయోజనం లేకుండాపోయింది.

    Also Read:Jeelugu Kallu: ఏపీలో స్వల్ప ధరకే ఆర్గానిక్ మద్యం.. తాగేటోళ్లకు తాగినంత.. ఎగబడుతున్న జనాలు

    Tags