Jaishankar: ఇస్లామాబాద్‌లో ఇచ్చిపడేసిన జైశంకర్‌.. దాయాదికి దిమ్మతిరిగేలా చురకలు!

పాకిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మంగళవారం(అక్టోబర్‌ 15న) వెళ్లారు. బుధవారం జరిగిన సమావేశంలో దాయాది దేశానికి చురకలంటించారు.

Written By: Raj Shekar, Updated On : October 16, 2024 4:06 pm

Jaishankar

Follow us on

Jaishankar: పాకిస్తాన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సు ఇస్లామాబాద్‌లో బుధవారం(అక్టోబర్‌ 16న) జరిగింది. ఈ సదస్సుల్లో భారత్‌ తరఫున మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే భారత జట్టు ఓడించినట్లుగా.. దాయాది దేశంలో జరిగిన సదస్సులోనే మన విదేశాంగ మంత్రి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు చురకలు అంటించారు. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించి విమర్శలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నమ్మకం, సహకారం లోపిస్తే పొరుగువారు దూరమవుతారని తెలిపారు. సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలు ఉంటే.. ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, అనుసంధానం, ప్రజల మధ్య సంబంధాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే జైశంకర్‌ తన ప్రసంగంలో ఎక్కడా పాకిస్తాన్‌ పేరు ప్రస్తావించలేదు. సమావేశం అనంతరం మంత్రి ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఎస్సీవో సదస్సులో మన దేశం ప్రకటనను వినిపించాను. కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్సీవో స్పందించాలి అని పోస్టులో పేర్కొన్నారు.

పాక్‌ ప్రధాని విందు..
ఇదిలా ఉంటే.. ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్య దేశాల ప్రతినిధులకు పాక్‌ ప్రధాని షెహబాస్‌ షరీఫ్‌ మంగళవారం రాత్రి తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా షెహబాజ్, జైశంకర్‌ కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సదస్సుకు హాజరైన భారత బృందానికి జైశంకర్‌ నేతృత్వం వహిస్తున్నారు. కాగా, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్తాన్‌లో పర్యటించడం 9 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2015లో అప్పటి విదేశఋ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్తాన్‌లో పర్యటించారు.

భారత బృందం మార్నింగ్‌వాక్‌
ఇదిలా ఉంటే ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ వెళ్లిన భారత బృందం బుధవారం(అక్టోబర్‌ 16న) మార్నింగ్‌ వాక్‌ చేసింది. భారత హైకమిషనర్‌ కార్యాలయంలోని తన సిబ్బందితో కలిసి జైశంకర్‌ కాసే నడిచారు. ఈ దృశ్యాన్ని కూడా జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.