https://oktelugu.com/

Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. వీటికి ఒపీనియన్ పోల్స్ కు ఏంటి తేడా.. ఎందులో కచ్చితత్వం ఉంటుంది?

ఎన్నికల పూర్తయిన తర్వాత.. వెల్లడించే వాటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు.. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగిన అనంతరం పోలింగ్ బూత్ లో ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 1, 2024 7:19 pm
    Exit Polls 2024:

    Exit Polls 2024:

    Follow us on

    Exit Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ దాదాపుగా ముగిసింది. ఏడు దశల్లో ఈ పోలింగ్ మొదలు కాగా.. శనివారంతో ఇది ముగిసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలింగ్ మూసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెల్లడిస్తాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరిగాయి. దీంతో అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై విపరీతంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల విషయంలో ఈ చర్చ రసవత్తరంగా మారింది. వైసిపి, కూటమి… రెండిట్లో ఏది అధికారంలోకి వస్తుందో అంతు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి..

    సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఎన్నికలకు సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆధారంగా చేసుకొని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఒక అంచనాకు రావచ్చు. అయితే ఈ దశలో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైనవేనా అనే సందేహం చాలామందిలో వ్యక్తమౌతోంది. అయితే ఇందులో ఒపీనియన్ పోల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ఖచ్చితమనేది స్పష్టంగా చెప్పడం మాత్రం కష్టం.

    ఒపీనియన్ పోల్స్ అంటే..

    ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది. ఓటరు నాడి పట్టుకునేందుకు అనేక మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలతో సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ కు ముందు నిర్వహించే వాటిని ఒపీనియన్ పోల్స్ అంటారు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలకు అనుగుణంగా పలు సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తాయి. పార్టీల మధ్యపొత్తు, ఇతర వ్యవహారాల ఆధారంగా పలు సంస్థలు వివిధ దశల్లో ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తాయి. ఇక ఓటర్ల నాడి పసిగట్టేందుకు పలు ఏజెన్సీలు సర్వేలు నిర్వహిస్తాయి. సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే రైతులు, యువతి యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారి నుంచి సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరిస్తాయి. ఆ తర్వాత ఒపీనియన్ పోల్స్ ను వెల్లడిస్తాయి. ఒపీనియన్ పోల్స్ అనేవి సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఎన్నికలకు ముందు పది రాజకీయ పార్టీలు వివిధ సంస్థల ద్వారా ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ను నిర్వహిస్తాయి. అందులో వచ్చిన ఫలితాలు ఆధారంగా తమ అడుగులు వేస్తాయి.

    ఎగ్జిట్ పోల్స్

    ఎన్నికల పూర్తయిన తర్వాత.. వెల్లడించే వాటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు.. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగిన అనంతరం పోలింగ్ బూత్ లో ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తారు. ఓటర్లు చెప్పిన సమాధానం ఆధారంగా ఒక అంచనాకు వస్తారు. ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వస్తుంది? ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఎంతమంది ప్రజల మనసు గెలుచుకుంటుంది? అనే అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తారు.

    కచ్చితత్వం ఎంతంటే..

    ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. ముందుగానే చెప్పినట్టు ఒపీనియన్ పోల్స్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఒపీనియన్ పోల్స్ ఎన్నికల ముందు నిర్వహిస్తుంటారు కాబట్టి.. ఆ సమయంలో ఓటర్ మూడ్ ను అవి ప్రతిబింబిస్తుంటాయి. అదే ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే అలా ఉండదు. ఎన్నికల తర్వాత ఓటర్ వేసిన ఓటు ఆధారంగానే అవి ఉంటాయి కాబట్టి.. ఫలితాలను దాదాపుగా ప్రతిబింబిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.