Jio Quick Mart: జియో మార్ట్ మరో సంచలన నిర్ణయం.. ఆ రంగంలోకి వస్తామన్న ముఖేష్ అంబానీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే జియో మార్ట్ ద్వారా సరుకులను హోమ్ డెలివరీ చేస్తుంది. అయితే అత్యంత త్వరగా డెలివరీ చేసే విభాగంలో ఇప్పటి వరకు పూనుకోలేదు.

Written By: Neelambaram, Updated On : June 1, 2024 6:50 pm

Jio Quick Mart

Follow us on

Jio Quick Mart: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు టెలికాం, రిటైల్ రంగాల్లో పెను మార్పులకు దారి తీసిన ఈ పారిశ్రామిక వేత్త మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు క్విక్ కామర్స్ సేవా విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్ బీబీ నవ్, జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి కంపెనీలు సవాళ్లు ఎదుర్కొక తప్పదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముఖేష్ అంబానీ ప్లాన్ ఏంటి?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే జియో మార్ట్ ద్వారా సరుకులను హోమ్ డెలివరీ చేస్తుంది. అయితే అత్యంత త్వరగా డెలివరీ చేసే విభాగంలో ఇప్పటి వరకు పూనుకోలేదు. రిలయన్స్ త్వరలో దేశంలోని 7 నుంచి 8 ప్రధాన నగరాల్లో తన త్వరిత డెలివరీ సేవలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ సేవలను 1000 నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

90 నిమిషాల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జియోమార్ట్ ప్లాట్‌ఫారంలో జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవను ప్రారంభించింది. ఇందులో 90 నిమిషాల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నది. అయితే ఏడాది క్రితం ఈ సర్వీసు నిలిచిపోయింది. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట నవీ ముంబైలో ప్రారంభించారు. ఆ తర్వాత 200 నగరాలకు తీసుకెళ్లాలని కంపెనీ యోచిస్తోంది.

30 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ
జియోమార్ట్ తన కస్టమర్లకు కేవలం 30 నిమిషాల్లోనే సరుకులు, ఇతర వస్తువులను డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నది. ప్రస్తుతం, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి కంపెనీలు 10 నుంచి 15 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ సేవలను అందిస్తున్నాయి. టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్ నౌ 30 నిమిషాల్లో నిత్యావసరాలు, ఇతర వస్తువులను హోమ్ డెలివరీ చేస్తున్నది. దీని కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జియోమార్ట్ నెట్‌వర్క్‌తో పాటు రిలయన్స్ రిటైల్ స్మార్ట్ బజార్ వంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించనుంది. ప్రస్తుతం, జియోమార్ట్ తన వినియోగదారులు ఎంపిక చేసుకున్న వస్తువులు మరుసటి రోజు డెలివరీ చేస్తున్నది.

ప్రస్తుతం, దేశంలోని క్విక్ కామర్స్ మార్కెట్‌లో బ్లింక్లిట్ అతిపెద్ద వాటాదారు. దీని మార్కెట్ వాటా 40 నుంచి 50 శాతంగా ఉంది.. మిగిలిన మార్కెట్‌లో ఇతర సంస్థలతో పాటు చిన్న కంపెనీలు కూడా స్థానికంగా వ్యాపారం చేస్తున్నాయి. అయితే, తాజాగా వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించాలనే ఆలోచన చేస్తు్న్నది.