Exit Poll Result 2024 : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెల్లడించాయి. జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి 25 స్థానాలలో విజయ బావుట ఎగరేసింది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలలో సత్తా చాటింది. మొత్తంగా చూస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే హేమంత్ సోరేన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపులో హేమంత్ అక్రమాలకు పాల్పడ్డారని.. తన దగ్గర వారికి చెందిన కంపెనీలకు గనులు కట్టబెట్టారని అభియోగాలు నమోదయ్యాయి.. ఇక హేమంత్ సోరెన్ కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. దీనికి తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలు బొగ్గు గనుల కేటాయింపులో హేమంత్ పై అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఎన్నికల్లో హేమంత్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి వ్యవహారం ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపించిందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సర్వే సంస్థలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి ఝార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాలు గెలుచుకునే అవకాశం లేదని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ – జార్ఖండ్ ముక్తి మొర్చా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయని.. ఆ కూటమికి 25 నుంచి 30 స్థానాలు మాత్రమే వస్తాయని మాట్రిజ్ అనే సంస్థ అంచనా వేసింది. ఇక బిజెపి కూటమి 42 నుంచి 47 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.
అవినీతి వ్యవహారాలు…
2019 నుంచి అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వంపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. సహజ సంపదకు ఆలవాలమైన జార్ఖండ్ రాష్ట్రంలో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. అయితే ఈ గనుల కేటాయింపులో నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ బొగ్గు గనులను తనకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయింపులు జరిపారని కేంద్ర దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. మనీలాండరింగ్ కు పాల్పడ్డారని కేసులు నమోదు చేశాయి. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల తనిఖీల్లో హేమంత్ ప్రభుత్వంలోని మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వద్ద భారీగా నగదు బయట పడింది. ” ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పథకాలలో అవక తవకలు అడ్డగోలుగా పెరిగాయి. దీంతో ప్రజలు ప్రభుత్వంపై విసుగు చెందారు. అందువల్లే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూశారు. అందుకే బిజెపి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని” మ్యాట్రిజ్ సంస్థ పేర్కొంది.. కాగా, ఇటీవల హేమంత్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రదర్శించారు. దీంతో వారిని బుజ్జగించడం అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చ కు తలకు మించిన భారమైంది. దీనికి తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపడంతో.. అతడు తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో రాజీ కుదరడంతో.. ప్రభుత్వం నిలబడింది. కాకపోతే హేమంత్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. అదే ఇప్పుడు ఎన్నికల్లో బిజెపికి బలంగా మారింది. ఎన్నికల మందు హేమంత్ వదిన సీతా సోరెన్ బిజెపిలోకి వచ్చారు. ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అంతేకాదు ఎన్నికల్లో ఆమె ద్వారా హేమంత్ పై ఆరోపణలు చేయించింది. ఇది సహజంగానే ఓటర్లను ప్రభావితం చేసిందని తెలుస్తోంది. అందువల్లే బిజెపికి ప్రజలు జై కొట్టారని సర్వే సంస్థలు చెబుతున్నాయి.