Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఆ రెచ్చగొట్టే మాటలే వైసిపికి చేటు!

YCP: ఆ రెచ్చగొట్టే మాటలే వైసిపికి చేటు!

YCP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ అవే మాటలు.. అవే చేతలు అన్నట్టు ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయవచ్చు. అవి సహేతుకంగా ఉండాలి. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని సమర్ధించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి సైతం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్లు మాట్లాడారు. అప్పుడే ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకన అయింది. అయితే అంబటి రాంబాబు అలా మాట్లాడడానికి దారి తీసిన కారణాలు ఉండవచ్చు. కానీ మీడియా ముందు, పోలీసుల ముందు ఆయన అలా మాట్లాడడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి అదే మైనస్. సామాన్యులు సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలను సహించలేకపోయారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతుండడం పై ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. వీరు మారరు గాక మారరు అని ఏ పార్టీల తోటి సంబంధం లేని తటస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

* పక్క రాష్ట్రంలో వ్యాపారాల్లో..
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి 20 నెలలు దాటుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు ఎపిసోడ్ తో ఆయన బయటకు వచ్చారు. ఏవేవో పిచ్చి మాటలు ఆడుతున్నారు. పోలీసులను పక్కనపెట్టి కొట్టుకుందామా అన్నట్టు ఆయన సవాల్ చేశారు. ఆయన మాటలు చూస్తుంటే గ్రామాల్లో కనీస అవగాహన లేని కార్యకర్తలు మాట్లాడిన తీరుగా ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంది. పరిస్థితి అదుపు తప్పుతోంది. సందట్లో సడే మియా అన్నట్టు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో సామాన్య జనాలు మాత్రం వీరి మాటలను ఎంత మాత్రం సహించుకోవడం లేదు.

* అప్పుడప్పుడు వచ్చి..
ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విపక్షంలో కూర్చోబెట్టారు. కూటమికి అధికారం ఇచ్చారు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం అంగీకరించడం లేదు. గత ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. అంతకుముందు మంత్రిగా ఉండేవారు. ఎమ్మెల్యేగా కొనసాగారు. ఓడిపోయిన తర్వాత ప్రజలకు కనిపించకుండా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా జనం అవసరం లేదన్నట్టు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజల్లో ఒక రకమైన ఆందోళనకు తెర లేపుతున్నారు. పోలీసులు లేకుండా రండి కొట్టుకుందాం అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ మాట ఉంది. ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలి. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదు. విశ్లేషకులు కూడా దీనిపైనే ఎక్కువగా హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version