Vishvendra Singh: కొడుకు, భార్యపై కోర్టుకెక్కాడు.. బుక్కెడు బువ్వ పెట్టక మాజీ మంత్రినే గెంటేశారు..

ఇంటికి వెళ్దామని భరత్‌పూర్‌కు వెళితే భార్య, కొడుకు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని విశ్వేంద్రసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు.

Written By: Raj Shekar, Updated On : May 20, 2024 11:46 am

Vishvendra Singh

Follow us on

Vishvendra Singh: రాజస్థాన్‌లో రాచరికపు ఆనవాళ్లు, రాజకుంటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాల్లోనూ రాజకుంటుంబాలే అధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంటికో పొయ్యి.. ప్రతి ఇంట్లో గొడవ సాధారణం అన్నట్లు రాజకుటుంబాల్లోనూ గొడవలు జరుగుతుంటాయి. తాజాగా భరత్‌పూర్‌ రాజకుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన భార్య, మాజీ ఎంపీ దివ్యాసింగ్, తనయుడు అనిరు«ద్‌ తనను వేధిస్తున్నారంటూ రాష్ట్ర మాజీ మంత్రి విశ్వేంద్రసింగ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను మోదీ మహల్‌ నుంచి బలవంతంగా గెంటేశారని పేర్కొన్నాడు. ఒక జత దుస్తులతోనే ఉన్నానని, గుండె జబ్బు ఉందని, సంచార జీవిగా బతుకుతున్నా అని తెలిపాడు. ఒకసారి ప్రభుత్వ వసతి గృహంలో కొన్నిసార్లు హోటల్‌లో ఉండాల్సి వస్తోందని వెల్లడించాడు.

చంపేందుకు కుట్ర..
ఇంటికి వెళ్దామని భరత్‌పూర్‌కు వెళితే భార్య, కొడుకు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని విశ్వేంద్రసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. తన ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. ఈమేరకు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు నెలకు రూ.5 లక్షల భరణం, మోతీ మహల్‌ను తిరిగి ఇప్పించాలని కోరాడు.

ఆరోపణలను ఖండించిన దివ్యాసింగ్‌..
దిలా ఉండగా విశ్వేంద్రసింగ్‌ తమపై చేసిన ఆరోపణలను అతని భార్య దివ్యాసింగ్, కొడుకు అనిరు«ద్‌ ఖండించారు. ఈ వ్యవహారంలో తామే బాధితులమని పేర్కొన్నారు. వారసత్వ ఆస్తులను అమ్మేందుకు విశ్వేంద్రసింగ్‌ యత్నిస్తున్నారని తెలిపారు. తమ ప్రతిష్ట దిగజారేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని కోర్టు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.