Ex-MP Prajwal Revanna: మనదేశంలో వ్యవస్థలు అందరికీ ఒకే విధంగా ఉండవు. అందరి విషయంలో ఒకే విధంగా పని చేయవు. సామాన్యుడి విషయంలో ఒక విధంగా.. పెద్దల విషయంలో మరొక విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడో అరుదైన సందర్భంలో మాత్రమే వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేస్తుంది. ఎంతవాడైనా సరే శిక్ష విధిస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి కర్ణాటక రాష్ట్రంలో పెను సంచలనం నమోదయింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న అత్యాచారం ఆరోపణలతో వెలుగులోకి వచ్చాడు. అతడు తన పనిమనిషిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఇటువంటి ఘోరాలు చాలా చేశాడని.. వీడియోలు రికార్డ్ చేసి ఆకృత్యాలకు పాల్పడడని ఆరోపణలు వచ్చాయి. అవన్నీ కూడా పోలీసు విచారణలో నిజమని తేలడంతో.. వాటిని నిరూపించడంలో పోలీస్ శాఖ విజయవంతం కావడంతో.. శిక్ష పడింది. అతను చేసిన నేరం అత్యంత తీవ్రమైనది కావడంతో జీవితకాల ఖైదును న్యాయస్థానం విధించింది. దీంతో అతడు కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. హసన్ నియోజకవర్గం లో పూర్వ ఎంపీగా ఉన్న అతడు తన రాజకీయ పలకుబడి ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కర్ణాటక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజ్వల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనకు ఉన్నదారులు మొత్తం మూసుకుపోయాయి…
ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్ లైబ్రరీ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఖైదీలకు పుస్తకాలు ఇస్తూ.. వాటిని నమోదు చేస్తున్నాడు. తద్వారా ప్రతిరోజు అతడికి 52 రూపాయల వేతనం లభిస్తోంది. వాస్తవానికి ప్రజ్వల్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అవసరమైతే కొండమీది కోతి నైనా తీసుకు రాగలడు. కానీ నేరాలకు పాల్పడితే.. మన వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ప్రజ్వల్ లాంటివాళ్ళు తప్పించుకోలేరు. జైలు చిప్పకూడు తింటూ శిక్ష అనుభవిస్తారు. ప్రజ్వల్ విషయంలో పనిచేసినట్టు మిగతా అందరిపై కూడా మన వ్యవస్థలు ఇలాగే పనిచేస్తే రాజకీయాలు బాగుంటాయి. ప్రజలకు మంచి జరుగుతుంది. అన్నట్టు ప్రజ్వల్ తన మీద ఎటువంటి కేసులు నమోదు కాకుండా.. ఎటువంటి శిక్ష పడకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించాడు. భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు. కొన్ని వ్యవస్థలను తనకు అనుకూలంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ నిలవలేకపోయాడు. గెలవలేకపోయాడు. చివరికి చిప్పకూడు తింటున్నాడు. అందుకే కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. చివరికి మాజీ ప్రధాని మనవడైనా సరే..