Nellore Politics: మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. కొత్త మంత్రులు కొలువుదీరారు. మంచి ముహూర్తాలు చూసి బాధ్యతలు సైతం స్వీకరించారు. కానీ మంత్రివర్గ విస్తరణ సెగ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే చాలా జిల్లాల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సెగ తాకుతోంది. వైసీపీలో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. గత కేబినెట్లో 25 మంది మంత్రులకుగాను.. కేవలం 11 మందికి మాత్రమే కొనసాగింపు లభించింది. మిగతా 14 మందికి ఉద్వాసన తప్పలేదు. అయితే తప్పించిన మంత్రులు కుతకుతలాడుతున్నారు. కొత్తగా మంత్రులైన వారిపై గుర్రుగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి కాకాని గోవర్థన్ రెడ్డికి కొత్తగా అవకాశమిచ్చి అగ్నికి ఆజ్యం పోశారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. కానీ జగన్ తన తొలి కేబినెట్ లో అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశమిచ్చారు. దీంతో జగన్ సొంత సామాజికవర్గ నేతలు కారాలు మిరియాలు నూరారు. జగన్ ఇవేవీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు.
అనిల్ కూడా అధినేత తనకిచ్చిన టాస్క్ ను పూర్తి చేసేవారు. పలానా వారికి తిట్టండి అంటే తిట్టేవారు. నోరు పారేసుకునేవారు. అందుకే విపక్షాలు నీటి పారుదల శాఖ మంత్రిని.. కాస్తా నోటి పారుదల శాఖ మంత్రిగా పేరు పెట్టాయి. అయితే జగన్ ఇచ్చిన స్వేచ్ఛను చూసి అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు. అప్పటికే జిల్లాలో అనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి వర్గాలు కొనసాగుతున్నాయి. సదరు ఇద్దరు నేతలు అమాత్య పదవి ఆశించి భంగపడ్డారు.
Also Read: TS Govt Jobs 2022: మరో 3 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దీంతో వారు అనిల్ కుమార్ యాదవ్ పై కోపంతో రగిలిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా వారి పట్ల దూకుడుగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా కాకాని గోవర్థన్ రెడ్డి వర్గాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మూడేళ్లలో తనకున్న మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కాకాని వర్గంపై ఓ రేంజ్ లో రివేంజ్ తీర్చుకున్నారు. అడుగడుగునా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అయితే రోజులంతా ఒకేలా ఉండవు, రాజకీయాలంతా ఒకే మాదిరిగా నడవవు. ఉన్నట్టుండి జగన్ కు తన సొంత సామాజికవర్గ నేత అయిన కాకాని గోవర్థన్ రెడ్డిపై ప్రేమ పుట్టుకొచ్చింది. తాజా మంత్రివర్గ విస్తరణలో అనిల్ ను తొలగించి కాకానికి అవకాశమిచ్చారు. ఇప్పుడు అంతా సీన్ మారిపోయింది. కాకాని అమాత్యుడై అనిల్ మాజీ అయ్యారు. రాజకీయంగా ఒంటరి అయ్యారు. ఇన్నాళ్లూ అధినేత కోసం, ఆయన ప్రాపకం కోసం తెగ వాగుడుకాయ అయిపోయిన అనిల్ ఉన్నట్టుంది సైలెంట్ అయిపోయారు. చివరకు తాజా మంత్రుల ప్రమాణస్వీకారానికి సైతం ముఖం చాటేశారు.
అనిల్ కంటే కాకాని సీనియర్
రాజకీయాల్లో కాకాని గోవర్థన్ రెడ్డి సీనియర్. విద్యాధికుడు కూడా. బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అయన స్వస్థలం పొదలకూరు మండలం తోడేరు. తండ్రి రమణారెడ్డి 18 ఏళ్ల పాటు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2006 ఎన్నికల్లో సైదాపురం మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసి గెలుపొందారు. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. 2014,2019 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. తాజా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. కాకాని గోవర్థన్ రెడ్డితో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో జూనియర్. ప్రజారాజ్యం పార్టీతో తన కెరీర్ ను ప్రారంభించారు. 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. తరువాత వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు.
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సైతం దూకుడుగా వ్యవహరించారు. అధికార పక్షంతో ఢీ అంటే ఢీ కొట్టారు. చివరకు జిల్లా అభివ్రద్ధి సమీక్ష సమావేశాల్లో సైతం వీది పోరాటానికి, ముష్టిగాతాలకు దిగిన సందర్భాలున్నాయి. అదే అనిల్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది. కాకాని గోవర్థన్ రెడ్డిని అనిల్ లెక్క చేయకుండా వ్యవహరించేవారు. రెండు వర్గాలుగా నడుచుకునేవారు. 2019 అధికారంలోకి వచ్చిన తరువాత కాకాని గోవర్థన్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి వర్గాలను అనిల్ తొక్కిపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో తలదూర్చారు. కాకాని గోవర్థన్ రెడ్డిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. దీంతో ఓర్పుతో కొన్నాళ్లు నడిచినా..అధిష్టానం ద్రుష్టికి పంచాయతీ నడిచింది. కానీ అనిల్ కుమార్ యాదవ్ ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. చివరకు అనిల్ కుమార్ తో విసిగి వేశారలేమని రెడ్డి సమాజికవర్గం నేతలంతా అధిష్టానం వద్దకు క్యూ కట్టారు. కానీ జగన్ కు అత్యంత ప్రీతిపాత్రుడు కావడంతో అనిల్ దూకుడును అడ్డుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. కానీ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ రూపంలో అవకాశం వచ్చింది. రెడ్డి సామాజికవర్గీయులంతా ఒకే తాటిపైకి వచ్చి అనిల్ యాదవ్ ను పదవి నుంచి తొలగించారు. కాకాని గోవర్థన్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ విషయంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా కొంత తగ్గినట్టు తెలుస్తోంది. మంత్రి పదవిపై ఆశ లేదన్న ప్రకటనతో కాకానికి ఆయన మార్గం సుగమమం చేశారు. మొత్తానికి రెడ్డి సామాజికవర్గం అనిల్ ను టార్గెట్ చేయనుందని నెల్లూరులో టాక్ వినిపిస్తోంది.
Also Read:Modi Kendriya Vidyalaya: పెంచమంటే తగ్గించాడే.. మోడీ మార్క్ షాక్ ఇదీ