Bandi Sanjay: వీణవంక దళితుల హత్య ఘటన నుంచి మొదలుపెడితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వరకు.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని కాదని బిజెపి వరుస ఆందోళనలు జరిపింది. అధికార భారత రాష్ట్ర సమితికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాదు ప్రగతి భవన్ కేంద్రంగా రాజకీయాలకు పదును పెట్టే కేసీఆర్ ను బయటకు తీసుకొచ్చింది. మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. అలాంటి భారతీయ జనతా పార్టీ ఒకానొక దశలో అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం ఆ పార్టీని ఒకింత డైలమాలో పడేసింది. కాంగ్రెస్ పార్టీని మించిన అంతర్గత రాజకీయాలతో కకావికలమైంది. పులి మీద పుట్ర లాగా అధిష్టానం బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పరిస్థితి మరింత దిగిజారింది.
ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు
ఉచిత విద్యుత్ కు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిని ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు.. ఉచిత విద్యుత్ మీద పేటెంట్ రైట్స్ తమకే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, రైతులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమదని భారత రాష్ట్ర సమితి చెప్పుకుంటున్నది. ఈ పరిణామాల వల్ల ప్రజలు కూడా ఒక రకమైన భావన ఏర్పడింది. మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం భారత జనతా పార్టీ అనుకున్నవారు.. ఇప్పుడు ఆ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రధాన మీడియా వరకు దీనికి సంబంధించిన చర్చ జోరుగా సాగుతుండడంతో బిజెపి అనేది సోయిలో లేకుండా పోయిందని వారు అంటున్నారు.. ఇలాంటి పరిస్థితి బీజేపీకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వారు చెబుతున్నారు.. మూడు ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించిన భారతీయ జనతా పార్టీ ఇలా అస్త్ర సన్యాసం చేయడం పట్ల వారు ఒకింత నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
నాయకత్వ లేమే కారణమా
బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని సమాచారం.. పైగా బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత కొద్ది రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. తర్వాత ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కనివిని ఎరుగని స్థాయిలో స్వాగతం లభించింది. 500 కార్లతో భారతీయ జనతా పార్టీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షుడయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఈ స్థాయిలో స్వాగతం లభించలేదు. పైగా కిషన్ రెడ్డి అధ్యక్షుడయి నెల కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన ఏర్పాట్లను నేరుగా అధిష్టానం చూసుకోవడంతో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇదే సమయంలో అదే వేదికపై బండి సంజయ్ మాట్లాడినప్పుడు అక్కడి సభా ప్రాంగణం మొత్తం ఉద్వేగంగా మారిపోయింది. బండి సంజయ్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆ సన్నివేశాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకింత నిర్వేదంలోకి వెళ్లిపోయారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యతగల ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాటి గురించి ప్రస్తావించడం లేదు. బండి సంజయ్ ని తొలగించిన తర్వాత ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది. కిషన్ రెడ్డి ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడంతో కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేయడం లేదు. బండి సంజయ్ కూడా ఇన్ని రోజులు తాను తన నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని, ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు తారాజువ్వలాగా ఒక వెలుగు వెలిగిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు పేలని బాంబులాగా మారిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి పార్టీ పెద్దలు కమలానికి కాయకల్ప చికిత్స చేస్తారో వేచి చూడాల్సి ఉంది.