Pawankalyan : వారాహి యాత్రలో పవన్ అధికార పక్షాన్ని టార్గెట్ చేయడంతో టీడీపీ ఖుషీ అయ్యింది. చలిమంట కాగినట్టు ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. వైసీపీ పవన్ పై ఎదురు దాడి చేసినప్పడు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా పవన్ ప్రసంగాలు ఉండడంతో లోలోపల ఆనందపడింది. అయితే ఆ ఆనందం వారిలో ఎంతసేపో నిలవలేదు. పవన్ నియోజకవర్గాలకు జనసేన ఇన్ చార్జిలను ప్రకటించడంతో టీడీపీ నోట్లో పచ్చి వెలక్కాయపడినట్టయ్యింది. వైసీపీని ప్రత్యక్షంగా, టీడీపీని పరోక్షంగా ఏసుకున్నారే అన్న సెటైర్లు పడుతున్నాయి.
గత కొన్నేళ్లుగా జనసేన యాక్టివ్ గా ఉన్నా.. ఏనాడు నియోజకవర్గాల ఇన్ చార్జులను ప్రకటించలేదు. తొలిసారిగా ఇన్ చార్జిలను ప్రకటిస్తుండడంతో టీడీపీ ఫ్యూజులు పగిలిపోతున్నాయి. అవి కూడా టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో వీరే క్యాండిడేట్లు అన్నట్టు పవన్ నియామకాలు చేస్తున్నారు. ఏకంగా నియామక పత్రాలనే అందిస్తున్నారు. కొవ్వూరుకు టీవీ రామారావు, పిఠాపురానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరానికి బత్తుల బలరామక్రిష్ణలను పవన్ ఇన్ చార్జిలుగా ప్రకటించారు. తణుకు నియోజకవర్గానికి విడివాడ రామచంద్రరావును అభ్యర్థిగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా తప్పుచేశానని.. బహిరంగ క్షమాపణలు అడిగారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడవాలన్నది రెండు పార్టీల వ్యూహం. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుందామని.. అప్పటివరకూ ప్రజల్లో ఉందామని చంద్రబాబు, పవన్ తీర్మానించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇరువు నేతలు ఎవరికి వారు తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. వారి వారి పార్టీల బలోపేతం పై ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడే ఒక తిరకాసు. చంద్రబాబు నియోజకవర్గాల రివ్యూలు పెడుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించి పనిచేసుకుపోవాలని నేతలకు సూచిస్తున్నాయి. అయితే ఇలా ఖరారు చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన ఆశించినవి కూడా ఉన్నాయి.
అయితే వారాహి యాత్ర ఊపు మీద ఉండడంతో.. దానిని కొనసాగింపుగా గోదావరి జిల్లాల్లో అభ్యర్థులను పవన్ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికి ఇన్ చార్జిలుగా చూపుతున్న ఎన్నికల్లో మాత్రం వీరే అభ్యర్థులుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ హఠాత్ పరిణామంతో టీడీపీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పవన్ తమకు అండగా ఉంటారని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులు సైతం ఈ పరిణామంతో కలవరపడుతున్నాయి. ఇలా ఎవరికి వారు పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుపోతే పొత్తు ధర్మానికి తూట్లు పొడిచే అవకాశాలున్నాయని భయపడుతున్నారు. అయితే ఈ విషయంలో జనసేన శ్రేణుల్లో ఖుషీ నెలకొనగా.. టీడీపీ శ్రేణులు మాత్రం నానా హైరానా పడుతున్నాయి.