Yuvagalam: యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు, పవన్ లు కీలక ప్రకటన చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో పాదయాత్ర విజయోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది టీడీపీ శ్రేణులు హాజరుకానున్నాయి. టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా విజయనగరం, విశాఖ చేరుకున్నాయి. చాలామంది ముందస్తుగా లాడ్జిల్లో బసచేయడం కనిపించింది.
ఈ నెల 20 తో లోకేష్ పాదయాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా రాయలసీమలో పూర్తి చేశారు. కోస్తా మీదుగా ఉభయగోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తుండగా చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో సెప్టెంబర్ 9న పాదయాత్రకు బ్రేక్ ఇస్తూ.. లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో సుమారు రెండు నెలల అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా మీదుగా విశాఖ వరకు నడిచారు. గ్రేటర్ విశాఖలోని శివాజీ నగర్ లో పాదయాత్రను ముగించారు. విజయవంతంగా పూర్తి అయినందుకు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు.
టిడిపి శ్రేణుల తరలింపునకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని చూసింది. బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ని కోరింది. ఆయన రీజినల్ మేనేజర్లకు సంప్రదించాలని సూచించారు. అయితే బస్సులు ఇవ్వడం కుదరదని ఆర్టీసీ అధికారులు తేల్చేశారు. అటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు కూడా ఇవ్వద్దని రవాణా శాఖ అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్లు టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో రాయలసీమ నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని విజయనగరం, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు చేరుకున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భోగాపురం మండలం పోలిపల్లికి పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ హాజరుకానుండడంతో జనసేన పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఈ సభకు రానున్నాయి. దాదాపు రెండు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ నుంచి ఇరుపార్టీలు ముమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఇరు పార్టీల అధినేతలు కీలక ప్రకటనలు వెల్లడించే అవకాశం ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా టాప్ 10 పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీట్ల విషయమై స్పష్టమైన ప్రకటన వెల్లడించే అవకాశం లేకపోయినప్పటికీ.. వైసీపీని అధికారం నుంచి దూరం చేసేందుకు త్యాగాలకు సిద్ధపడాలని నేతలకు అధినేతలు పిలుపునిచ్చే అవకాశం ఉంది.