Ethical hackers : ప్రస్తుతం మనం టెక్ యుగంలో ఉన్నాం. ప్రతి పని ఆన్లైన్లోనే సాగుతోంది. దీనివల్ల మన జీవితం ఎంత సుఖమయం అయిందో.. అదే స్థాయిలో కష్టాలు అనుభవిస్తున్నది. ప్రతి పనికి డిజిటల్ మీదే ఆధారపడటం వల్ల.. దాని మీదే ఆధారపడి బతికే వారు పెరిగి పోయారు. వారిని టెక్నాలజీ పరిభాషలో హ్యాకర్లు అంటారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయాక హ్యాకర్ అంటే బడా వ్యాపారం నుంచి సామాన్యుల దాకా అందరికీ భయమే.. అన్ లైన్ ఆర్డర్ నుంచి మొదలుకొని, బడా కంపెనీల దాకా విలువైన సమాచారం మాత్రమే కాదు వెబ్ సైట్స్ కూడా ఎప్పుడు ఎలా హ్యాక్ అవుతాయో కూడా తెలియదు. అయితే అలాంటి భయం లేకుండా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు ఎథికల్ హ్యాకర్స్. సైబర్ క్రిమినల్స్ వ్యూహాలకు చెక్ పెడుతూ సమాచారం హ్యాక్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.

-ఒక్క హైదరాబాదులోనే 50,000 మంది
సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక మనం ప్రతి విషయానికి ఇంటర్నెట్ మీద ఆధారపడిపోవడం ఎక్కువ అయిపోయింది. అందుకే సైబర్ క్రిమినల్స్ వేల కిలోమీటర్ల దూరం నుంచే ఎంతో విలువైన సమాచారం నొక్కేస్తున్నారు. బ్యాంకు అకౌంట్స్, కంపెనీల కీలక సమాచారం, ఆన్లైన్ బిజినెస్ లావాదేవీలను చాలా సులువుగా హ్యాక్ చేస్తున్నారు. డబ్బులే కాకుండా కీలకమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఇలాంటి సైబర్ క్రిమినల్స్ ను పట్టుకోడానికి గతంలో నెలల తరబడి పట్టేది. కొన్నిసార్లు ఏళ్ళు గడిచినా నిందితుల జాడ తెలిసేది కాదు. హైదరాబాదులో సైబర్ క్రైమ్ జరిగి అకౌంట్స్, వెబ్ సైట్స్ హ్యాక్ అయితే ఎథికల్ హ్యాకర్ల కోసం బెంగళూరు, ముంబై లాంటి నగరాలపై ఎక్కువగా ఆధారపడేవాళ్లు. సమస్య పరిష్కారానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఎంత పెద్ద క్లిష్ట సమస్య అయినప్పటికీ.. నిమిషాల్లోనే హ్యాకర్లు సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్క హైదరాబాదులోనే 50 వేల మంది దాకా ఎథికల్ హ్యాకర్లు అందుబాటులో ఉన్నారు..పెద్ద కంపెనీలు కూడా ఎథికల్ హ్యాకర్లను భారీగా నియమించుకుంటున్నాయి. లక్ష నుంచి వారి అనుభవాన్ని బట్టి వేతనాన్ని చెల్లిస్తున్నాయి. కంపెనీలు, వెబ్ సైట్ నుంచి ఏ సమాచారం హ్యాక్ కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేసుకుంటామని ఎథికల్ హ్యాకర్లు చెప్తున్నారు. ఒకవేళ హ్యాక్ అయినా వెంటనే సమాచారాన్ని వెనక్కి వచ్చేలా చేస్తున్నారు. అయితే కంపెనీలు, సంస్థలు తమ సమాచారాన్ని ఒకే వద్ద నమోదు చేయకుండా, కచ్చితంగా బ్యాకప్ పెట్టుకోవాలని ఎథికల్ హ్యాకర్లు సూచిస్తున్నారు.
ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ భరోసా
ప్రస్తుతం హ్యాకింగ్ కు సంబంధించి ఏ సమస్యకైనా హైదరాబాద్ ఎథికల్ హ్యాకర్ స్విగ్ వెంటనే పరిష్కరిస్తున్నది. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు ఐటీ కంపెనీల దాకా ఎథికల్ హ్యాకర్లకు మంచి డిమాండ్ ఉంది. మొబైల్స్, ల్యాప్ టాప్స్, సిస్టమ్స్ డేటా రికవరీని కూడా ఎథికల్ హ్యాకర్స్ చేస్తున్నారు. వన్ జిబి డాటా బ్యాకప్ కి ₹5,000 నుంచి ₹10,000 దాకా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో వ్యాపారంగంలో పోటీ, లాభాలు సంపాదించడమే కాదు. సమాచార భద్రత పైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అంతలా పెరిగిపోయారు హ్యాకర్లు. కంపెనీ డేటా, వ్యాపార లావాదేవీలు హ్యాకర్లకు చేరకుండా ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక నానాటికి ఎథికల్ హ్యాకర్లకు డిమాండ్ ఎక్కువ అవుతుండడంతో ఈ కోర్సులు నేర్పించే సంస్థలు కూడా పుట్టగొడుగుల పుట్టుకొచ్చాయి. కోర్సు వ్యవధి ఆధారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు ఎథికల్ హ్యాకర్లు అయితే విదేశాలకు కూడా వెళ్తున్నారు.