Dussehra 2022 విజయదశమి నాడు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మి చెట్టుపై దాచి, అజ్ఞాతవాసం పూర్తి అవ్వగానే ఆ వృక్షాన్ని పూజించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు.. అనంతరం శమీ వృక్షరూపాన ఉన్న అపరాజితా దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయభేరి మోగించారు. అంతకన్నా ముందు శ్రీరాముడు కూడా రావణుడిపై దండేత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయలుదేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమి నాడు అందరూ శమీ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

-ప్రకృతి విధ్వంసం ఎంత పని చేసింది
పండుగ అంటేనే ప్రకృతితో పెన వేసుకోవడం. మనం జరుపుకునే ప్రతి పండగ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంతో ముడిపడి ఉన్నదే. కానీ మానవుడి చేష్టల వల్ల, అభివృద్ధి పేరుతో చేస్తున్న వికృత క్రీడల వల్ల పర్యావరణం గతి తప్పుతోంది. ఫలితంగా అనేక సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. వెనుకటి రోజుల్లో దసరా రోజుల్లో జమ్మి చెట్టు కింద జమ్మి చెట్టు కింది రాత జయం జయం అని రాసి చీటీలు కొమ్మలకు కుచ్చి, జమ్మి ఆకులు తెంపి జేబులో వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు జమ్మి చెట్లు చూద్దామన్నా కనిపించడం లేదు. బంజరు భూముల్లో ఎక్కువగా జమ్మి చెట్లు పెరుగుతాయి. కానీ స్థిరాస్తి వ్యాపారం వల్ల బంజరు భూములన్ని వెంచర్లు అయిపోయాయి. దీంతో జమ్మి చెట్లను సమూలంగా తొలగించారు. ఇప్పుడు పండగ పూట ఎక్కడో ఒకచోట జమ్మికొమ్మను నరుక్కుని తీసుకువచ్చి తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. ఇక పాలపిట్ట జాడైతే కంటికి కనిపించడం లేదు. పురుగుమందుల వాడకం అధికం కావడంతో పాలపిట్టల సంతతి కనుమరుగైపోయింది.
-ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అధ్యయనం ప్రకారం
తెలంగాణ ప్రాంతంలో జీవవైవిద్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. వాస్తవానికి ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జమ్మి చెట్లు అధికంగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం భారీగా పుంజు కోవడంతో వ్యాపారులు జమ్మి చెట్లను సమూలంగా నరికి వేశారు. ఇక పాలపిట్టల సంతతి అయితే దాదాపు కనుమరుగైపోయినట్టే. ఎక్కడో ఒకచోట వాటి ఆనవాళ్లు ఉన్నప్పటికీ.. వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదు. కవ్వాల్ లాంటి ప్రాంతాల్లో పాలపిట్ట ఆనవాళ్లు కనిపించినప్పటికీ.. అవి మిగతా ప్రాంతాల్లో జీవించేందుకు అనువైన పరిస్థితులు లేవు. ఇందుకు కారణం మితిమీరిన పురుగు మందులు వాడటమే. వాస్తవానికి పాలపిట్ట పంటలను ఆశించే వివిధ చీడపీడలను తిని బతుకుతుంది. కానీ వాటి నివారణకు రైతులు మితిమీరిన స్థాయిలో పురుగు మందులను వాడటం వల్ల పాలపిట్టలు తిని చనిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుండటం వల్ల అది వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాలపిట్టను అంతరించిపోతున్న జాతిగా యునెస్కో ప్రకటించింది అంటే పరిస్థితి తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అభివృద్ధి అంటూ పరుగులు తీస్తున్న ప్రభుత్వం మన సాంస్కృతికి జీవ గర్ర అయినటువంటి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా చెదిరిపోతుంటే మౌన పాత్ర వహిస్తోంది. కోట్లకు కోట్లు ఖర్చుచేసి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మన మూలాలను పరిరక్షించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం.