మాజీమంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. విమర్శల దాడి చేస్తున్నారు. ఆయన రహస్యాలు బయటపెడుతూ ఇరుకున పెడుతన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా రోజుకో విధంగా కేసీఆర్ పై రెచ్చిపోతున్నారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ ఇరుకున పెడుతున్నారు. కేసీఆర్ పై రాజకీయ యుద్ధంలో భాగంగా ఆయన విమర్శలు కేసీఆర్ కు ఎక్కడో తాకుతున్నాయి. దీంతో ఆయన పెదవి విప్పడం కూడా చేయడం లేదు.
దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ఓ ఎన్నికల స్టంటుగా అభివర్ణించారు. కార్పొరేషన్ల ద్వారా దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ నాటకంగా భావించారు. కేసీఆర్ కు దళితులంటేనే ఇష్టం లేదని తేల్చేశారు. దళితులను ఎప్పుడు గౌరవించలేదని చెప్పారు. ఎన్నికల కోసమే వారిని అక్కున చేర్చుకున్నట్లు ప్రకటనలు చేస్తారే తప్ప ఆచరణలో కనిపించదని గుర్తు చేశారు.
కేసీఆర్ మనుషులకు కాదు కులానికి ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. చిన్న కులం అంటే అసహ్యం వ్యక్తం చేస్తారని సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు ఉదాహరణగా ప్రగతి భవన్ లో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా దళితుడు ఉండడని అన్నారు. కావాలంటే తరచి చూసుకోవచ్చని సవాలు విసిరారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తూ కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నారు. దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికలో ధనమే ప్రధానంగా ప్రభావం చూపుతుందని ఎద్దేవా చేశారు. డబ్బుకు, నీతికి ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై త్వరలో నిజాలు తెలుస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అన్నారు. ధనమే ప్రధానంగా ఓట్లు రాబట్టుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని చెప్పారు. అన్నిటిని తిప్పి కొడతామని పేర్కొన్నారు.