ఈటల హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వైద్యులు ఆయన మోకాలికకి సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఆయన కొంతకాలం బెడ్ రెస్ట్ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర కొన్నాళ్లు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ పాదయాత్ర చేపట్టినా మోకాలి గాయం తిరగబడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వయసు రీత్యా ఈటల ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
ఒకవేళ ఈటల రాజేందర్ కోలుకున్నా పాదయాత్ర చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేరుగా పాదయాత్ర చేసే సూచనలు కనిపించడం లేదు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు ఈటల ఏ మార్గం ఎంచుకుంటారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
సుమారు 350 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఈటల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూపడంతోనే ప్రమాదం ముంచుకొచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైద్యులను అందుబాటులో ఉంచుకోవాల్సిన ఆయన నిర్లక్ష్యం వహించడంతోనే ఇలా జరిగిందని వాపోతున్నారు. ఆహారం తీసుకునే విషయంలో కూడా ఆయన సమయపాలన పాటించలేదని పేర్కొన్నారు దీంతో పాదయాత్ర మధ్యలో ఆగడంతో బీజేపీ శ్రేణుల్లో సైతం నిరుత్సాహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.