హుజురాబాద్ ఎన్నికపై రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. పోటీలో ఉన్న అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారం మాత్రం చేపడుతున్నాయి. ప్రచారంలో బీజేపీ మాత్రం ముందుంది. ఇప్పటికే తన ప్రచారం మొదలుపెట్టింది. ఈటల రాజేదర్ సతీమణి జమున నియోజకవర్గం తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా సరే బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు.
జులై 19 నుంచి ప్రచారం ముమ్మరం చేసేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. నియోజకవర్గ పరిధిలో ఈటల రాజేందర్ పర్యటించనున్నారు. పాదయాత్ర ద్వారా అన్ని గ్రామాలు తిరిగి ఓట్లు వేయాలని కోరనున్నారు. అందరికి అనుక్షణం అండగా ఉండేందుకు పాటుపడతానని పేర్కొన్నారు. ప్రాణం పంచే ప్రజల దీవెనల కోసం 22 రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రజల అండదండలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
సోమవారం ఉదయం 7.30 గంటలకు కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లి లోని హనుమాన్ దేవస్థానంలో ఈటల ప్రత్యేక పూజలుచేస్తారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ప్రజలను కలిసేందుకు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తారు. అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేయాలని ఓటర్లను కోరనున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని అడిగేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఈటల రాజేందర్ తాను పోటీ చేసినా తన భార్య పోటీలో ఉన్నా ప్రజలు ఆదరించాలని ప్రార్థిస్తున్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా ప్రజల దీవెనలు అవసరం అన్నారు. ఇందుకోసమే తాము జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. దొరల పాలనకు చరమగీతం పాడాలని కోరారు. మిగతాపార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నాయని విమర్శించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో డబ్బుకు కాకుండా సేవ చేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మద్యంకు దాసోహం కాకూడదని అన్నారు. డబ్బు సంచులతో టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజాసేవ చేసేవారిని గుర్తించి ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీని ఆదిరించాలని ప్రార్థించారు. భారీ మెజార్టీతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని అన్నారు.