Homeజాతీయ వార్తలుEtela Rajender: బీజేపీ ప్రచార సారథిగా ఈటల రాజేందర్‌ !?.. సీఎం అభ్యర్థి కూడా..?

Etela Rajender: బీజేపీ ప్రచార సారథిగా ఈటల రాజేందర్‌ !?.. సీఎం అభ్యర్థి కూడా..?

Etela Rajender: తెలంగాణలో మూడేళ్లుగా అనూహ్యంగా పుంజుకున్న భారతీయ జనతాపార్టీ.. ఒకానొక దశలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్న టాక్‌ తెచ్చుకుంది. నెల, రెండు నెలల క్రితం వరకు ఢీ అంటే ఢీ అన్నట్లుగానే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉన్నాయి. సడెన్‌గా పరిస్థితి మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రభావం తెలంగాణ బీజేపీపై కూడా పడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. అధికారం సంగతి ఎలా ఉన్నా పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారుతోంది. బీజేపీలో గతంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు.

కొత్త, పాత నేతల మధ్య కోల్డ్‌వార్‌..
పార్టీలోకి వలస వచ్చిన నేతలు.. పాత నేతల మధ్య కోల్డ్‌ వార్‌ తారా స్థాయికి చేరింది. బీజేపీలో కోవర్టులు ఉన్నారని, వారే కాషాయ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, వారి గురించి త్వరలోనే పేర్లు బయటపెడతామని కొంత మంది చేస్తున్న ప్రకటనలతో పరిస్థితి దిగజారుతోంది. కోవర్టుల గురించి ఈటల మొదలు చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్నారు. ఒక విధంగా బండి సంజయ్‌ వర్గం..ఈటల వర్గంగా పార్టీలో నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పదవీ కాలం ముగిసింది. అయినా ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఆయనను మార్చే అవకాశం లేదని హైకమాండ్‌ చెబుతోంది. మార్చాల్సిందేనని వలస నేతలు పట్టుబడుతున్నారు.

వలస నేతల్లో ఒకరికి కీలక పదవి..
పార్టీలో పెరుగుతున్న విభేదాలతో వలస నేతల్లో ఒకరికి పెద్ద పదవి ఇవ్వాలని హైకమాండ్‌ భావిస్తోంది. ఈటల రాజేందర్‌ను ఈ కోణంలోనే అధిష్టానం ఢిల్లీ పిలిపించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు అగ్రనేత అమిత్‌ షా ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రచార, హామీల, మేనిఫెస్టో, క్రమశిక్షణా తదితర కమిటీలను కొత్త నేతలతో అధిష్టానం భర్తీ చేయనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్‌కు ఎన్నికల వ్యూహాల ఖరారు కమిటీ లేదా ప్రచార కమిటీ వంటి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను మారుస్తారని ప్రచారం సాగుతున్నా.. ఎన్నికల సమయంలో సాధ్యం కాదని ఇప్పటికే తేల్చి చెప్పారు.

బీసీని సీఎం అభ్యర్థిగా ప్రమోట్‌ చేసేలా..
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేయనున్నట్లు ప్రజల్లోకి సంకేతం పంపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అధ్యక్షుడుగా బీసీ సామాజిక వర్గానికి చెంది బండి సంజయ్‌ ఉన్నారు. ప్రచార సారధిగా ఈటలను నియమిస్తే.. ఆయన ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. సీఎం అభ్యర్థిగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో నూతన పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular