Essentials Prices: ఏపీలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఏం కొనలేం.. తినలేం అన్నట్టుంది పరిస్థితి. ముఖ్యంగా కరోనా తర్వాత పెరిగిన ధరలు అదుపులోకి రాలేదు. పైగా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం లేచింది మొదలు పాలు కొనుగోలు నుంచి.. పడుకునే ముందు వేసుకునే మందులు వరకు ధరల స్థిరీకరణ అంటూ లేదు. రెండు రోజుల ముందున్న ధర కూడా ఈరోజు లేకపోవడం విశేషం. అయితేధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. అయితే మన ఒక్క రాష్ట్రంలోనే ధరలు పెరిగాయి అనుకుంటే మనం పొరపడినట్టే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైతం ధరలు ఇదే మాదిరిగా ఉండడం విశేషం
ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో భారత్ కీలకం.కానీ అస్థిర వాతావరణ పరిస్థితులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా నిత్యవసరాల ధరలు దాదాపు 11 శాతం పెరిగాయి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే మేల్కొన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధరలు అదుపులోకి రావడం లేదు. దీంతో సామాన్యుడికి ఏం తినాలో.. ఏం కొనాలో అర్థం కాని పరిస్థితి. ఆదాయ వనరుల పెరిగే పరిస్థితులు కానరాకపోయినా.. ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. గతంలో జేబులో డబ్బులు వేసుకుని సంచి తో సరుకులు తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం సంచి తో డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం.
ధాన్యం ధరలు ధైర్యంగా ఉండగా.. బియ్యం ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. అంటే రైతు వద్ద ఉన్న ధాన్యం.. బియ్యం గా మారే క్రమంలో దళారులుగా ఉన్నవారు బాగుపడుతున్నట్టు ఇట్టే అర్థం అవుతుంది. పప్పులు, కూరగాయలు, నూనెలు వంటి వాటి విషయంలో చెప్పనక్కర్లేదు. నానాటికీ ఇవి ఖరీదైన వస్తువులుగా మారుతున్నాయి. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. రకరకాల రాజకీయ కారణాలతో అటువైపు చూడడం మానేస్తుంది. దీంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మరి సొమ్ము చేసుకోవడం విశేషం.
వాస్తవానికి ధరల నియంత్రణకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. అది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్ గా, అదనపు పాలన అధికారి, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన శాఖ, మార్క్ఫెడ్, పౌర సరఫరాల సంస్థ డిఎం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు నిత్యవసర సరుకులతో సంబంధం ఉన్న అధికారులు ఈ కమిటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలి. ధరల నియంత్రణపై చర్చించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరలను అదుపు చేయాలి. కానీ ఏపీలో ఒక్కజిల్లాలో కూడా ఈ కమిటీ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు, దళారులు రెచ్చిపోతున్నారు. నిత్యవసర ధరలు పెంచి, కృత్రిమ కొరత సృష్టించి మరి ప్రజలను దోచుకుంటున్నారు.