కాశ్మీర్ లో అబ్డుల్లాల ఖేల్ ఖతం కాబోతుంది ?

జమ్మూ-కాశ్మీర్ లో అబ్డుల్లాల శకం ముగింపునకు వచ్చిందనిపిస్తుంది. ఇంతవరకు జరిగిన చరిత్ర చూస్తే వీళ్ళు దేశానికి చేసిన మంచికన్నా ద్రోహమే ఎక్కువ. మత రాజకీయాల్ని,’మేము తప్పితే కాశ్మీర్ కి గతి లేదనే వాతావరణం’ సృష్టించి ఇన్నాళ్ళు పబ్బం గడుపుకొచ్చారు. కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకొని ఆ డబ్బుతో కాశ్మీర్ రాజకీయాల్ని ఏలుతూ వున్నారు. ఈ విషయం కాశ్మీర్ ప్రత్యేకవాదులు ఎప్పుడో గ్రహించారు. మన పాలకులు గ్రహించటానికి కొంచెం సమయం పట్టింది. నెహ్రు కుటుంబం అబ్డుల్లాల భవిష్యత్తుని దెబ్బతినకుండా […]

Written By: Ram, Updated On : October 20, 2020 8:09 am
Follow us on

జమ్మూ-కాశ్మీర్ లో అబ్డుల్లాల శకం ముగింపునకు వచ్చిందనిపిస్తుంది. ఇంతవరకు జరిగిన చరిత్ర చూస్తే వీళ్ళు దేశానికి చేసిన మంచికన్నా ద్రోహమే ఎక్కువ. మత రాజకీయాల్ని,’మేము తప్పితే కాశ్మీర్ కి గతి లేదనే వాతావరణం’ సృష్టించి ఇన్నాళ్ళు పబ్బం గడుపుకొచ్చారు. కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకొని ఆ డబ్బుతో కాశ్మీర్ రాజకీయాల్ని ఏలుతూ వున్నారు. ఈ విషయం కాశ్మీర్ ప్రత్యేకవాదులు ఎప్పుడో గ్రహించారు. మన పాలకులు గ్రహించటానికి కొంచెం సమయం పట్టింది. నెహ్రు కుటుంబం అబ్డుల్లాల భవిష్యత్తుని దెబ్బతినకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి మోడీ బారినపడి ఆ ఆటకి ముగింపు కాబోతుందనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ ఖేల్ అర్ధంగాక ఇప్పటికీ ఎంతోమంది అబ్దుల్లాలు లేకపోతే కాశ్మీరం ఏమయివుండేదోనని వాపోతూ వుంటారు. నిజంగా కాశ్మీర్ అబ్దుల్లాలు లేకపోతే మనకలిగేది కాదా?

జమ్మూ-కాశ్మీర్ లో అబ్డుల్లాల పాత్ర 

జమ్మూ-కాశ్మీర్ మహారాజా హరిసింగ్ ఆధ్వర్యాన స్వతంత్రంగా వున్నప్పుడు ప్రారంభమయింది అబ్డుల్లాల ప్రస్థానం. షేక్ అబ్దుల్లా జమ్మూ-కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ పేరుతో మెజారిటీ ముస్లింలు వున్నా హిందూ రాజరికం ఏమిటనే దానితోనే ఉద్యమించాడు. చాలామంది మొదట్నుంచీ షేక్ అబ్దుల్లా సెక్యులర్ భావాలతో వున్నాడని  అనుకుంటారు. ఆ తర్వాత ఈ పేరుని నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చుకున్నాడు. మొదట్నుంచీ నెహ్రూని అడ్డంపెట్టుకొని మహారాజా హరిసింగ్ ని దెబ్బతీయాలనే ప్రయత్నించాడు. జమ్మూ-కాశ్మీర్ 1947 అక్టోబర్ లో విలీనమైనప్పుడు కూడా ఈ రాజకీయాలు చేస్తూనే వచ్చాడు. నెహ్రూ ప్రాపకంతో జమ్మూ-కాశ్మీర్ ప్రధానమంత్రిగా మహారాజా హరిసింగ్ నుంచి పదవి సంపాదించాడు. అప్పటినుంచే మహారాజా హరిసింగ్ ని జమ్మూ-కాశ్మీర్ నుంచి ఎలా బయటకు సాగనంపాలో పధకాలు రచించాడు. చివరకు నెహ్రూ ప్రాపకంతో మహారాజా హరిసింగ్ ని  జమ్మూ-కాశ్మీర్ నుంచి తప్పించి ఆయన కుమారుడ్ని ఆ పీఠంపై కూర్చోబెట్టేదాకా నిద్రపోలేదు. చివరకు మహారాజా హరిసింగ్ ముంబైలో నివసిస్తూ చనిపోయాడు.

షేక్ అబ్దుల్లా కోసం ఇంత చేసిన నెహ్రూకి కూడా ఎప్పుడూ తలనొప్పులే సృష్టించాడు. మౌంట్ బేటన్ మాటవిని ఐక్యరాజ్యసమితికి కాశ్మీర్ సమస్యని తీసుకెళ్లటం ఎంత తప్పో తర్వాత దశలో నెహ్రూకి అర్ధమయ్యింది. అమెరికా, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితిలో ఏ విధంగా భారత్ ని నట్టేట ముంచినవీ అర్ధం చేసుకొని విచారించటం నెహ్రూ వంతయ్యింది. షేక్ అబ్దుల్లా అప్పట్నుంచీ నెహ్రూ మీద ఒత్తిడి తెస్తూనే వున్నాడు. మొదట్లో కొన్నాళ్ళు మిన్నకున్నా కాశ్మీర్ ని తన గుప్పెట్లో పెట్టుకొని భారత్ లో కలపకుండా చేయాలని కుట్రలు పన్నాడు. చివరకు భరించలేక అదే నెహ్రూ షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టాడు. ఆయన లేకుండానే  జమ్మూ-కాశ్మీర్ రాజ్యాంగ సభ సమావేశం జరిపి భారత్ లో జమ్మూ-కాశ్మీర్ అంతర్భాగమని ఆమోదించారు. ఆ విషయం మనం గమనించాలి. అయితే మిగతా రాజకీయ నాయకుల తప్పులను తెలివిగా ఉపయోగించుకొని షేక్ అబ్దుల్లా నెహ్రూతో మంతనాలు జరిపాడు. నెహ్రూ-అబ్దుల్లా ఒప్పందం పేరుతో ఇంకో నాటకానికి తెరతీశాడు. ఆర్టికల్ 35ఎ పేరుతో కాశ్మీర్ ని శాశ్వతంగా భారత్ కి దూరంగా వుంచగలిగాడు. విశేషమేమంటే ఇది ఇప్పటికీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగకుండానే కొనసాగింది. దీన్ని కూడా అబద్దపు ప్రాతిపదికపైనే నిర్మించారు. ఎప్పుడో కాశ్మీర్ మహారాజు స్థానికులకు రక్షణ కోసం తీసుకొచ్చిన స్థానిక చట్టాన్ని అడ్డంపెట్టుకొని ఈ ఆర్టికల్ ని అదీ అడ్డదారిలో తీసుకొచ్చారు. మహారాజు చట్టంలో పది సంవత్సరాలు ఎవరైనా జమ్మూ-కాశ్మీర్ లో శాశ్వత నివాసం వుంటే పౌరులవుతారు, వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. కానీ కొత్త చట్టంలో  1948 తర్వాత వచ్చిన ఎవర్నీ శాశ్వత పౌరులుగా చేయకుండా నిషేదించారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్ధులు 70 సంవత్సరాలనుండి ఉంటున్నా వాళ్లకు ఓటు హక్కులేదు. శాశ్వత నివాసులు కారు. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావు. కాశ్మీర్ ఆడవారు బయటవారిని వివాహం చేసుకుంటే వారికి ఆ హోదా పోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి. మన వ్యాసం ఉద్దేశం పక్కదారి పడుతుందని ఆ వివరాలలోకి వెళ్ళటంలేదు.

ఫరూక్ అబ్దుల్లా చరిత్ర ఏమీ వాళ్ళ నాన్నకు తీసిపోదు 

ఫరూక్ అబ్దుల్లా ఇటీవల ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం చైనా సహాయం తీసుంటానని, అసలు ఆర్టికల్ రద్దు వలెనే చైనా భారత్ పై యుద్ధం చేస్తుందని ప్రకటించాడు. ఇవేమీ చరిత్ర  తెలిసిన వాళ్లకు కొత్త కాదు. వాళ్ళ నాన్న 1962 చైనా యుద్ధం తర్వాత 1965 లో రహస్యంగా చౌఎన్ లై ని అల్జీర్స్ లో కలిసాడు. ఆయన వాళ్ళ సహాయం కోరాడు. కాబట్టి ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. తన రాజకీయ అధికారం కోసం ఎక్కడికైనా వెళ్ళటం అబ్డుల్లాలకు అలవాటే. ఇందిరా గాంధీ భరించలేకే ఫరూక్ ని జైల్లో పెట్టింది. తిరిగి రాజీవ్ గాంధీ ఒప్పందం చేసుకొని ఫరూక్ తో కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఫరూక్ ఎన్నికల్లో గెలవటం కోసం కాంగ్రెస్ తో కలిసి 1988 ఎన్నికల్ని రిగ్గింగ్ చేసారు. అదే కొంపముంచింది. ఆ ఎనికల్లో ముస్లిం ఐక్య సంఘటన పేరుతో పోటీ చేసిన వాళ్ళు తర్వాత కాశ్మీర్ ఉగ్రవాదులుగా మారారు. కారణం ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలిచినా మోసం చేసి నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచినట్లు ప్రకటించటం వాళ్లకు ఎన్నికలు బూటకమని ప్రజల్ని నమ్మించటానికి ఓ అద్భుత అవకాశంగా మారింది. అదే తర్వాత 1989 లో కాశ్మీర్ లో ఇతర మతస్తుల ఏరివేత పేరుతో కాశ్మీర్ పండితులను తరిమివేయటానికి సాకుగా మారింది. దీనిలో ఫరూక్ అబ్దుల్లా రిగ్గింగ్ ఎన్నిక భూమిక అని మరిచిపోవద్దు. ఏదైతే ఇప్పుడు దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాద అడ్డాగా మారిందో అక్కడనుంచి అనేకమంది కాశ్మీర్ పండితులు వెళ్ళిపోవటానికి ముఫ్తీలు కూడా పరోక్షంగా సహకరించారు. ఇప్పటికీ అనంతనాగ్ మహబూబా ముఫ్తీ పార్లమెంటు స్థానమే. ఈ ఫరూక్ ని ఆ ఎన్నిక తర్వాత ప్రజలు నమ్మటం మానేశారు. కాంగ్రెస్ ప్రాపకంతో ఇక్కడిదాకా నెట్టుకొచ్చారు. బెదిరింపు రాజకీయాలు చేస్తూ నేను తప్పితే డిల్లీ వాళ్ళకు గతి లేదనే వాతావరణాన్ని సృష్టించి ఈ రాజకీయ కుటుంబాలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఇప్పుడు దీనికి చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి.

జమ్మూ-కాశ్మీర్ ని అబ్దుల్లాలు దోచేశారు 

కాశ్మీర్ లోని గుప్కార్ రోడ్డు ఫరూక్ అబ్దుల్లా శాశ్వత నివాసం. అసలు విశేషమేమంటే ఒకసారి ఎవరైనా ముఖ్యమంత్రి పీఠం అలంకరిస్తే వాళ్లకు శాశ్వతంగా నివాసం ఫ్రీ, దాని నిర్వహణ ఖర్చులు ఫ్రీ. ఇన్నాళ్ళు అలానే నడిచిపోయింది. మొట్టమొదటిసారి ఇటీవల వాటిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చింది. ఇన్నాళ్ళు అవినీతి పై దర్యాప్తు జరగకుండా ఆర్టికల్ 370 ని అడ్డంపెట్టుకొని పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఇటీవలే అదివరకు ఆర్ధిక మంత్రిగా చేసిన రాథేర్ కొడుకుని  జమ్మూ-కాశ్మీర్ బ్యాంకు కుంభకోణంలో సిబీఐ అరెస్టు చేసింది. దేశంలోనే పెద్దదైన 25 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంపై హైకోర్టు సిబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ కుంభకోణంలో ఫరూక్ అబ్డుల్లాని ప్రశ్నించింది. ఇవన్నీ సముద్రంలో నీటి బొట్టులే. మూడు తరాల్లో ఈ కుటుంబం కాశ్మీర్ నిధుల్ని బొక్కేసింది. ఇప్పుడే ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. అన్నీ బయటకు రావటం అంత తేలిక కాదు. ఎందుకంటే ఈ దోపిడీ లో అధికార యంత్రాంగం, మిగతా రాజకీయ నాయకత్వం కూడా వాటా దారులే. ఈ అవినీతి భాగోతం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ ఒకటే. ముఖ్యంగా అబ్దుల్లాలు, ముఫ్తీలు, ఆజాద్ లు ఇందులో ప్రధాన ముద్దాయిలు. తెలివిగా తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలని ప్రచారం చేస్తున్నారు. గుప్కార్ ప్రకటన ఇటీవలిది , రోష్నీ కుంభకోణం, క్రికెట్ కుంభకోణం వెలికితీత అంతకుముందుదే. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు. దోపిడీని కప్పిపుచ్చుకోవటానికి రాజకీయ ముసుగు మాత్రమే. వీటిని జాగ్రత్తగా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటానికి కొన్ని పార్టీలు , మరికొన్ని మీడియా సంస్థలు కావాలి. ఆ పాత్ర సిపిఎం, రాజ్దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు పోషిస్తున్నారు. సిపిఎం స్థాపకులు జీవితాల్ని త్యాగం చేశారు, ఇప్పటి నాయకత్వం విలువల్ని త్యాగం చేస్తున్నారు. సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని మతం పేరుతో మభ్యపెట్టి, కాశ్మీర్ అస్తిత్వం పేరుతో మాయ మాటలు చెప్పి దోచుకుంటున్న ఈ కుటుంబాలకు వత్తాసు పలకటాన్ని సిపిఎం ఏ విధంగా సమర్ధించు కుంటుందో చెప్పాలి?

గుప్కార్ ప్రకటన పెద్ద మోసం 

ఒక్క కాశ్మీర్ నే కాదు, మిగతా 560 సంస్థానాలను కూడా ఇదే ఒప్పందపత్రంతో స్వాధీనం చేసుకున్నారు. మత ప్రాతిపదికన కాదుకదా. మహారాజా సంతకంతోనే ఈ విలీనాలు చట్టబద్ద మయ్యాయి. 1947 భారత స్వాతంత్ర చట్టం, 1935 భారత చట్టంలో ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణకు తావులేదు. మౌంట్ బేటన్, బ్రిటీష్ కుట్రలో భాగంగానే నెహ్రూ పక్కదారి పట్టాడు. ముద్దాయిలు బ్రిటీష్ వాళ్ళు. ఆయనకు తెలిసి కావాలని చేసింది కాదు. అందుకనే తర్వాత తప్పు తెలుసుకున్నా అప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగింది. చొరబాటుదారుల్ని బయటకు పంపాల్సిన ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం నెరపటం శోచనీయం. ఈ క్రమంలోనే అబ్దుల్లాలు కొరకురాని కొయ్యలుగా మారారు. మొదట్నుంచీ సరైనదారిలో కనుక కాశ్మీర్ రాజకీయం నడిచివుంటే ఇప్పటికి కాశ్మీర్ దేశానికే తలమానికం అయివుండేది. అద్భుతమైన, కనువిందు చేసే భూభాగం ఎందుకూ పనికిరాని రణరంగంగా మారింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, మత చాందసులకు స్వర్గధామంగా మారింది. ఇవన్నీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగలేదు, గత 70 సంవత్సరాల పాలకుల నిర్వాకమే. ఇప్పటికైనా ఓ కొత్త పరిష్కారంతో మోడీ కాశ్మీర్ సమస్యను సానుకూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు మనం అనేక ప్రయోగాలు చూసాం. ఈ ప్రయోగాన్ని కూడా చూద్దాం. ఇదంతా ఒక ఎత్తయితే తిరిగి మళ్ళా ఈ పాత కాపుల్ని చేరదీయటం వృధా ప్రయాస. కాశ్మీర్ యువత 21వ శతాబ్దపు ఆశలను, ఆకాంక్షలను ఆహ్వానిస్తున్నారు. వాళ్లకు చేయూత నిస్తేనే కాశ్మీర్ కి భవితవ్యం వుంటుంది. అందుకు ముందుగా ఈ దోపిడీదారుల్ని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది. అప్పుడే ఈ యువతకి కూడా ప్రభుత్వ నిర్ణయాలపై నమ్మకం ఏర్పడుతుంది. అందుకే అబ్దుల్లాల శకం ముగిస్తేనే నవ శకం మొదలవుతుంది. సామాన్య ముస్లింల బతుకులు బాగుపడతాయి.