Emergency Flashpoint : కాంగ్రెస్ పై మోదీ, అమిత్ షా మార్క్ ఎమర్జెన్సీ ఇది

1975లో ఏం జరిగిందో తెలుసు. భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారో, జూన్ 25 న ఏం చేశారో తెలుసు. స్వాతంత్ర పోరాటం జరిగిన ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారు. ఎలాంటి కారణం చెప్పకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. మీడియాను కూడా అణచివేశారు. నాటి రోజులకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది జూన్ 25న "సంవిధాన్ హత్యాదివాస్" నిర్వహించేందుకు మేము నిర్ణయించాం.

Written By: Anabothula Bhaskar, Updated On : జూలై 12, 2024 10:17 సా.
Follow us on

 

Emergency Flashpoint : పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ ఆశించినంత స్థాయిలో మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. సహజంగానే ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో భాగస్వామ్య పార్టీల తోడ్పాటుతో బిజెపి ఎన్డీఏ పేరుతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర దారుణమైన దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వీటిని సహజంగానే జాతీయ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఫలితంగా పార్లమెంట్ లో నరేంద్ర మోదీ, అమిత్ షా నిశ్శబ్దాన్ని పాటించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరుసటి రోజు ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చినప్పటికీ.. అది ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. ఈ లోగానే ప్రధానమంత్రి రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత కేంద్రం కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఎమర్జెన్సీ అస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చింది. నాడు కాంగ్రెస్ పరిపాలన కాలంలో ఏం జరిగిందో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. సోషల్ మీడియా వేదికలుగా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.. బిజెపి శ్రేణులు కూడా పదేపదే కాంగ్రెస్ పార్టీపై ఇదే విషయంపై విమర్శలు చేస్తున్నాయి.

” 1975లో ఏం జరిగిందో తెలుసు. భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారో, జూన్ 25 న ఏం చేశారో తెలుసు. స్వాతంత్ర పోరాటం జరిగిన ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారు. ఎలాంటి కారణం చెప్పకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. మీడియాను కూడా అణచివేశారు. నాటి రోజులకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది జూన్ 25న “సంవిధాన్ హత్యాదివాస్” నిర్వహించేందుకు మేము నిర్ణయించాం. అత్యవసర సమయంలో ప్రజలు ఇబ్బంది పడిన బాధను, నాటి రోజులను ఎదిరించి నిలబడిన యోధులను ఆరోజున మేము గుర్తు చేసుకుంటామని” కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరోవైపు ఈ ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” నాడు ఎంతటి భయోత్పాతం సంభవించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి పరిపాలన సాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశం కాంగ్రెస్ చేసిన చీకటి పరిపాలన కారణంగా నష్టపోయింది. ఆ రోజుల్లో ఇబ్బంది పడిన వారిని స్మరించుకునే రోజు ఇదని” ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇటీవల చోటుచేసుకున్న మణిపూర్ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వంపై విమర్శల తీవ్రతను పెంచారు. గతంలో ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఆయన కేంద్రంపై నిప్పులు చెరగడం మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చేతిలో రాజ్యాంగం పట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో తమపై రాజ్యాంగ నిరోధకులు అనే ముద్రను వేస్తున్న సమయంలో.. దానిని తొలగించుకునేందుకు బిజెపి ఈ స్కెచ్ వేసిందని తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.