Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడా నికి కారణమేంటి?… గుర్తు తెలియని వ్యక్తుల విద్రోహచర్యా?.. నిర్మాణ నాణ్యతలోనే లోపమున్నదా?… ఇంజినీరింగ్ డిజైన్ బ్లండరా?.. ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రజల్లో ఈ విద్యాధికులు, స్థానిక ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. విద్రోహ చర్య అంటూ ఇజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భూపాలపల్లి జిల్లా ఎస్పీ మాత్రం ఎలాంటి కుట్ర కోణం లేదంటున్నారు. నాణ్యతా లోపం కారణంగానే బ్యారేజీ కుంగిపోయిందని రిటైర్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రిత్వశాఖ.. దాని పరిధిలో ఉన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణుల బృందాన్ని స్టడీ కోసం పంపింది. క్షేత్రస్థాయిలో ఈ బృందం అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో ఎలాంటి అంశాలను కారణంగా పేర్కొంటుందనేది కీలకంగా మారింది. ముందు ఒక పిల్లర్ అడుగు మేర భూమిలోకి కుంగిపోయిందని మాత్రమే వెలుగులోకి రాగా ఈ బృందం పరిశీలనలో పిల్లర్లుపగుళ్లు ఏర్పడిన అంశం కొత్తగా తెరమీదకు వచ్చింది..
నాడు క్లౌడ్ బరస్ట్.. నేడు..?
గతేడాది జూలైలో కన్నేపల్లి పంప్‌హౌజ్ మునిగిపోవడానికి క్లాక్ బరస్ట్ కారణమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. విదేశీ శక్తులకు ఉన్నదని, అందువల్లనే భారీ స్థాయిలో వరదలు వచ్చాయన్న కామెంట్స్ చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకృతి వైపరీత్యాలేవీ లేకపోవడంతో విపక్షాలు అనుమానించినట్టుగానే చివరకు ఇది విద్రోహ చర్మ’ అనే డైలాగులు వినిపించాయి.
ప్రభుత్వ ఒత్తిడితో ఫిర్యాదు..
ఘటన జరిగిన 24 గంటల తర్వాత మహదేవపూర్ పోలీసు స్టేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికాంత్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఈ ఫిర్యాదు ఇప్పించిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.. భారీ శబ్దం వచ్చిన తర్వాత వెళ్లి చూసినప్పుడు 21వ నంబర్ పిల్లర్ కుంగిపోయినట్టు తేలిందని అందులో ఏఈఈ పేర్కొన్నారు. నిర్మాణ నాణ్యతలోనే లోపం ఉందనేది నిర్ధారణ అయితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని, ఎన్నికల సమయంలో అధికార పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతుందనే మాటలూ వినిపించాయి. ఈ కారణంగానే విద్రోహ చర్య అనే అంశాన్ని ఎంచుకున్నదనే చర్చలూ జరుగుతున్నాయి దీనిపై స్పందించిన భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖారే ఇందులో కుట్ర కోణం లేదు అంటూ మొదట ప్రకటన విడుదల చేశారు. గంటల వ్యవధిలోనే ‘దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం’ అంటూ మారుస్తూ మరో ప్రకటనలో తెలిపారు.
ప్రశ్నార్థకమైన పోలీసు భద్రత….
– బ్యారేజీకి రెండు వైపులా 24 గంటలూ పోలీసు పహారా ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల కళ్లు గప్పి బ్యారేజీ కిందకు చేరుకుని విద్రోహానికి పాల్పడడం.. సాధ్యమేనా? అనే చర్చ మొదలైంది. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా విద్రోహ చర్యకు పాల్పడడమంటే పోలీసులు సరిగ్గా విధి నిర్వహణ చేయడంలేదని, వారి డ్యూటీలో ఫెయిల్ అయ్యారనే ముగింపుకు రావాల్సి ఉంటుంది. చివరకు పోలీసులు జవాబుదారీ అవుతారు. ప్రభుత్వం తన నాణ్యతా లోపం నింద నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులకు బురద అంటుకుంటుంది.
నిర్మాణ లోపమే..
పిల్లర్ కుంగిన ఘటన చూస్తే కాంక్రీట్ స్ట్రక్చర్లో లోపముని స్పష్టంగా అర్ధమవుతున్నదని రిటైర్డ్ ఇంజినీర్స్ పోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. విద్రోహ చర్యకు ఆస్కారమే లేదన్నారు. వాహనాల లోడ్ కుంగిందనే వాదన కూడా అర్ధరహితమన్నారు. ఒక ప్రాజెక్టును కట్టేటప్పుడు సాయిల్ టెస్ట్ మొదలు వాహనాల లోడ్ వరకు అన్ని నిర్దిష్టమైన లెక్కల ప్రకారం డిజైన్ జరుగుతుందన్నారు, పైగా కార్గో వెహికల్స్ బ్యారేజీ, మీద నుంచి వెళ్లడం లేదన్నారు. ఒకవేళ అలాంటిది జరిగినా∙తొలుత మీద ఉన్న సిమెంటు క్లాబ్ పైన ప్రభావం పడి దెబ్బతింటుందని, ఆ తర్వాత బీమ్ ఎఫెక్టు పడుతుందని, చివరకు పిల్లర్కు ఇబ్బంది ఎదురవుతుదని వివరించారు. తాజా ఘటనలో పిల్లర్ కుంగిపోవడమే కాకుండా పగుళ్లు కూడా వచ్చాయని, పిల్లర్ కింద ఉన్న కాంక్రీట్ బేస్మెంట్ స్టక్చర్‌ను కూడా విశితంగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
బీఆర్‌ఎస్ కు బ్యాడ్ టైమ్..
2018 ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)ను గట్టెక్కించింది. తాను మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రకటించారు. కాంగ్రెస్ గెలిస్తే అన్నీ ఆగిపోతాయని పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. దీంతో కేసీఆర్‌నే మళ్లీ గెలిపించారు. అయితే ఈ ఎన్నికల సమయంంలో కాళేశ్వరం నిర్మాణ లోపమే బీఆర్‌ఎస్ ఓటమికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎలక్షన్ సమయంలో అధికార పార్టీకి ఇది బ్యాక్ టైమ్ అన్ని ప్రచారంలో కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకునే అవకాశమే లేకుండా పోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఏం మాట్లాడినా అది బ్యాక్‌ఫైర్ అవుతుందంటూ పలు సెక్షన్ల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మైలేజ్ రాకపోగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని పార్టీ నేతల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్రోహమైనా, నాణ్యతాలోపమైనా ప్రభుత్వానికే చెడ్డపేరు అనేది మెజారిటీ ప్రజల వాదన.