ఏలూరులో ప్రజలు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కరొనా నేపథ్యంలో ఇదేం కొత్త వ్యాధి? అని జనం భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ పరిస్థితికి తాగునీటి కలుషితమే కారణం కావొచ్చు అనే అనుమానం చాలా మందిలో ఉంది. వైద్యులు, అధికారులు, పలువురు నేతలు కూడా తాగునీరు కలుషితం కావడం వల్లేనని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు అసలు కారణం తాగునీరు కాదని చెప్పడం విశేషం. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కు వివరణ ఇచ్చిన అధికారులు.. ఇది గాలి, నీరు కలుషితం కావడం వల్ల వచ్చిన సమస్య కాదని చెప్పడం గమనార్హం.
Also Read: భూములు అమ్మేస్తున్న సర్కారు..!
మరింకేంటి?
ఈ వ్యాధికి గాలి, నీరు కారణం కాకపోతే మరింకేంటి? అనే ఆందోళన మొదలైంది. వైద్యులు ఈ కోణంలో పరిశోధనలు సాగిస్తున్నారు. బాధితుల రక్త నమూనాల్లో నికెల్, సీసం ఉన్న మాట వాస్తవమేనంటున్న అధికారులు.. అవి గాలి, నీరు ద్వారా శరీరంలోకి వెళ్లలేదని మాత్రం చెప్పగలుగుతున్నారు. ఆహారం కల్తీ విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. బియ్యంలో పాదరసం కలసిన ఆనవాళ్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, పప్పులు, కూరగాయలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్ధాలను పరిశీలిస్తున్నామని, ఈనెల 16 నాటికి అసలు కారణం చెబుతామని అంటున్నారు.
ఎన్ఐఏ, హైదరాబాద్ వివరణ..
బాధితుల ఇళ్లలో సేకరించిన బియ్యంలో పాదరసం ఆనవాళ్లు అధికంగా ఉన్నాయని, టమోటా వంటి కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు గుర్తించామని, బాధితుల రక్తంలో ఆర్గోనా పాస్ఫరస్ ఉందని ఎన్ఐఏ బృందం తెలిపింది. అయితే.. అది వారి శరీరంలోకి ఎలా చేరిందో గుర్తించాల్సి ఉందని ప్రకటించింది.
ఢిల్లీ ఎయిమ్స్ పరిశీలన..
ఏలూరులోని చాలా ప్రాంతాల్లో పాల నమూనా సేకరించామని ఎయిమ్స్ బృందం తెలిపింది. పాలలో నికెల్ అవశేషాలున్నట్టు గుర్తించామని, బాధితుల మూత్రంలో లెడ్, రక్త నమూనాల్లో మాత్రం లెడ్, నికెల్ రెండూ ఉన్నాయని, పురుగు మందులు అధికంగా వాడటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు చెప్పారు. ఆహార పదార్ధాల్లో ఆర్గానో క్లోరిన్ ఉందా లేదా అనే విషయం త్వరలో తెలుస్తుందని అన్నారు.
Also Read: భూ వివాదంలో జనగామ ఎమ్మెల్యే: ప్రతిపక్షాల ఆందోళన ఉద్రిక్తం
ఏలూరు పురపాలక శాఖ ఇలా అంటోంది..
ఏలూరులో మొత్తం 100 చోట్లనుంచి సేకరించిన తాగునీటిని పరీక్షించామని, భార లోహాల ఆనవాళ్లు లేవని, భూగర్భ జలాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిరోజుల్లో ఫలితాలు వస్తాయని, నీటిలో ఈ-కోలి సాధారణ స్థాయిలోనే ఉందని అంటున్నారు.
భయందోళనలో జనం..
ఎంతమంది, ఎన్ని రకాల విశ్లేషణలు చెబుతున్నా.. ఎక్కడా క్లారిటీ లేదు. దీనంతో అసలు కారణం తెలియక జనం భయపడుతున్నారు. బాధిత ప్రాంతాల నుంచి కొంతమంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. మరికొంతమంది తమ పిల్లల్ని బంధువుల ఇళ్లకు పంపిస్తున్నారు. అధికారులు త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్