https://oktelugu.com/

Elon Musk: నీకు ఇది సిగ్గు చేటు.. ట్రూడో ను ఏకి పారేసిన మస్క్

" ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్ షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్ కాస్ట్ లు అందించే ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : October 2, 2023 / 12:03 PM IST
    Follow us on

    Elon Musk: సొంత దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సర్వేలలో ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో పాలు పోక ఖలిస్థానీ వాదాన్ని ఎత్తుకున్నాడు. అదికూడా తీవ్ర విమర్శల పాలైంది. దీనికి తోడు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ కంపెనీలకు కూడా విసుగు తెప్పిస్తోంది. అంతేకాదు వ్యాపార వర్గాల్లో ఆయనను మరింత పలుచన చేస్తోంది. ఇంతకీ ఎవరు అతను? ఒక దేశ అధ్యక్షుడి హోదాలో అతడు ఎందుకు అంత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు?

    జస్టిన్ ట్రూడో.. ఈ కెనడా అధ్యక్షుడు ఎప్పుడైతే తన దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ వైపు వేలు ఎత్తి చూపాడో.. అప్పటినుంచి ఆయన వైపు ప్రతికూల పవనాలు వీయడం మొదలయ్యాయి. భారత్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టు అని ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామం మర్చిపోకముందే ట్రూడో ఎక్స్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కెనడా దేశంలో వాక్ స్వాతంత్రాన్ని తొక్కి పెడుతున్నారని ఆరోపించారు.. దీనికి కారణం లేకపోలేదు.. కెనడా దేశంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇటీవల ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని ప్రముఖ జర్నలిస్టు గ్లెన్ గ్రీన్ వాల్డ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ” ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్ షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్ కాస్ట్ లు అందించే ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు” అని గ్రీన్ వాల్డ్ రాసుకొచ్చాడు.

    అయితే గ్రీన్ వాల్డ్ ట్విట్టర్ పోస్ట్ పై మస్క్ స్పందించారు.”దేశంలో వాక్ స్వేచ్ఛను అణిచి వేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. సిగ్గుచేటు” అని మస్క్ రాసు కొచ్చారు. ఇలా వాక్ స్వేచ్ఛపై ట్రూడో ప్రభుత్వం దాడి చేస్తుందని గతంలోనూ విమర్శలు వచ్చాయి. 2022 ఫిబ్రవరిలో కోవిడ్ వ్యాక్సిన్ ను తప్పనిసరి చేస్తూ కెనడా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదేశాలను అక్కడి ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. వీరిని అణచివేసేందుకు ట్రూడో కెనడా చరిత్రలోనే తొలిసారి ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించారు.

    మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దిగజారి పోతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందని ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణకు సంబంధించి బలమైన ఆధారాలు ఉంటే చూపించాలని భారత్ ఇప్పటికే డిమాండ్ చేసింది. ఇదే నేపథ్యంలో భారత దేశంలో ఉన్న కెనడా దౌత్యాధికారిని తిరిగి ఆదేశానికి పంపించింది. అంతేకాదు ఆ దేశవాసులకు భారత్ వీసా సేవలను నిలిపివేసింది.. ఇక్కడ కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించుకోవాలని సూచించింది. మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై ట్రూడో నుంచి ఎటువంటి కౌంటర్ ట్వీట్ రాలేదు.