Telangana- AP Early Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎన్నికల సమరశంఖం పూరించారు. క్యాడర్‌ను కర్యోన్ముకులను చేశారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూడు రోజుల తర్వాత కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇదే సందర్భంగా సిట్టింగులకే టికెట్ ఇస్తానని ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.

ఏపీ ‘ముందస్తు’..
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఏడాది నుంచే ఎమ్మెల్యేలు, ఎంపీలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయంత్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో.. ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉందని జగన్ పార్టీ నేతలకు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి ఏడాది నుంచి ఏడాదికో.. రెండేళ్లకో మన ప్రభుత్వం వస్తుందని చెప్పేవారు. అదేంటి.. అలా చెబుతున్నారని అందరూ అనుకునేవారు. అధికారంలోకి వచ్చాక.. తన పదవీ కాలాన్ని రెండు, మూడు నెలలు ఎక్కువగా ఉండేలా చెప్పుకునేవారు. రెండేళ్లు దాటిన తర్వాత ఇంకా మూడున్నరేళ్లుదని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం పదవి కాలాన్ని తగ్గించుకుని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర అంటే.. 18 నెలలు ఉంటే.. రెండు నెలలు తగ్గించుకుని చెబుతున్నారు. దీంతో జగన్‌కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారన్న అంశంపై ఆ పార్టీ నేతలకు క్లారిటీ వస్తోంది.
ఎన్నికల బదిలీలు పూర్తిచేస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎన్నికలై ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అప్పుడే ఏపీలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. ఎప్పుడు ఎలా వచ్చినా దానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవల అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది. త్వరలో పాలన వ్యవస్థలోనూ ఇలాంటి బదిలీలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలాంటి బదిలీలు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడే చేసేస్తోంది.
కేసీఆర్‌తో సంప్రదింపులు?
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో జగన్‌కు బయటకు కనిపించని అనుబంధం ఉంది. అది ఎన్నోసార్లు బయటపడింది. రెండుపార్టీల మధ్య మంచి అవగాహన ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే బీజేపీతో కేసీఆర్ నేరుగా యుద్ధం ప్రకటించారు.. వైసీపీ మాత్రం ఆ పార్టీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తోంది. ఈ రెండు భిన్నదారుల వల్ల వారు తమ అవగాహనను బయట పెట్టుకోలేకపోతున్నారు. అయితే అంతర్గత సంప్రదింపుల ద్వారా ఒకే సారి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

ఇదే గేమ్ ప్లాన్!
కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. పది నెలల్లో ఎన్నికలని కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో వైసీపీ కూడా విడిగా ఎన్నికలకు వెళ్లడం కన్నా.. కలిసి వెళ్లడమే మంచిదని భావిస్తోంది. పార్లమెంట్‌తోపాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోయినా ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. ఏపీలో మాత్రం ఏడాదిన్నరలో జరగాల్సి ఉంది. ఎప్పుడు జరిగినా రెండూ ఒకేసారి జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.