TN Seshan- Supreme Court: తమకు ఇష్టమైన రిటైర్డ్ బ్యూరో కార్ట్ లను ప్రభుత్వం నియమించుకోవడం కాకుండా.. న్యాయ వ్యవస్థలోని కొలిజీయం విధానం మాదిరి ఎందుకు ఉండకూడదు అనేది మొన్న సుప్రీం కోర్టు లేవనెత్తిన కేసు… నిన్నటి దాకా విచారణ జరిగింది. లోతుల్లోకి వెళ్ళడం లేదు గానీ మ అసలు కొలిజీయం పద్ధతి మీదే బోలెడు విమర్శలు ఉన్నాయి.. పైగా కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయం ఏమీ అల్టిమేట్ కాదు. తనకు ఏమి వీటో పవర్స్ ఉండవు. అందులో ముగ్గురు సభ్యులు ఉంటారు.. మెజారిటీ నిర్ణయం ఫైనల్. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారిగా శేషన్ మళ్లీ వస్తే ఈ వ్యవస్థ స్వరూపమే మారుతుంది. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక శేషన్ అప్పట్లో మన ఎన్నికల వ్యవస్థను పరుగులు పెట్టించాడు.. ఎన్నికల నిర్వహణకు కొత్త దిశను నిర్దేశించాడు.. సుప్రీంకోర్టు మొన్ననే కాదు . వందలాది కేసుల్లో శేషన్ ను స్తుతిస్తూనే ఉంది.. ఉంటుంది కూడా. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఆయన వేసిన పునాదులు అటువంటివి. ఆయన చేపట్టిన మార్పులు అటువంటివి.. ఒక వ్యవస్థలో బలమైన ముద్ర వేయాలంటే.. బలమైన పనితీరు కావాలి.. అలాంటి బలమైన వాడే శేషన్.

ఒక ఊపు ఊపాడు
శేషన్.. 90లో దేశ రాజకీయాలలో ఒక ఊపు ఊపారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను నిక్కచ్చిగా ఉపయోగించారు. రాజకీయ పార్టీలను గడగడలాడించారు. నేతలను వణికించారు. సంస్కరణలు తీసుకురావాలంటే నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చాలు అని నిరూపించారు. సంచలనాలు మాత్రమే కాదు… వివాదాల్లోనూ శేషన్ తనదైన ముద్ర వేశారు. మన రాజ్యాంగం దేశ ఎన్నికల కమిషన్ కు ఎన్నో విశేష అధికారాలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు చాలామంది కేంద్ర ప్రభుత్వానికి సాగిల పడిపోయారు. ఆ దశలో 1990 డిసెంబర్ 12న కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యుడిగా వచ్చిన శేషన్ తనదైన ముద్ర వేశారు.. 1996 డిసెంబర్ 11 దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 1954లో సివిల్స్ లో విజయం సాధించి తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ కలెక్టర్ గా ఉంటూనే హార్వర్డ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసులోకి వచ్చి అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు. 1985- 88 మధ్య అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా తెహ్రి, సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను వ్యతిరేకించారు.. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు.. 1989లో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవిగా భావించే భారత కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా కొనసాగారు.. 1990లో శేషన్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా నియమితులయ్యారు. అప్పటి న్యాయశాఖ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది.
గడగడలాడించారు
ఐఏఎస్ గా రాజకీయ పరిమితులను ఎదుర్కొన్న శేషన్.. రాజ్యాంగబద్ధమైన సీఈసీగా బాధ్యత చేపట్టగానే విశ్వరూపం చూపించారు.. ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి కత్తెర వేశారు.. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.. ఎన్నికల నిబంధనవాళి కచ్చితంగా అమలు చేయడం, ఓటర్ ఐడి కార్డుల జారి, గోడలపై రాతలు బంద్, అభ్యర్థుల ఖర్చుకు పరిమితులు విధించడం, మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం, ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులను నియమించడం, ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం, అనుమతి లేకుండా మైకులు వాడకంపై నిషేధం, వస్తాగత ఎన్నికల జరుపకుండా ఉండే పార్టీలకు గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించడం.. ఇలా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపించిన కారణంగా దాదాపు 1,500 మంది అభ్యర్థులపై మూడేళ్లపాటు వేటు పడింది.
అప్పుడు కూడా ఇలాంటి ఘటనే
ప్రధానమంత్రి తప్పుడు నిర్ణయం పై చర్య తీసుకోగల ప్రధాన ఎన్నికల కమిషనర్ కావాలి అంటూ సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది శేషన్ హయాంలో అలాంటి ఘటన జరిగింది
*పీవీ నరసింహారావు హయాంలో ఆయన మంత్రివర్గ సభ్యులు సీతారామ్ కేసరి, కల్పనా రాయ్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వారిని కేబినెట్ నుంచి తొలగించాలని శేషన్ ఏకంగా ప్రధానికి సిఫార్సు చేశారు. దీనిపై దుమారం జరిగింది. శేషన్ తన పరిధిలు దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ.. ఆయనను పార్లమెంటులో అభిశంసించాలనే డిమాండ్ తలెత్తింది.
* ఇదంతా సులభం కాదని తెలిసిన పివి చాకచక్యంగా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎంఎస్ గిల్, జీవిజి కృష్ణమూర్తి ని నియమించి శేషన్ కు ముకుతాడు వేసే ప్రయత్నం చేశారు.

*ఆ ఇద్దరు కమిషనర్లను గాడిదలుగా అభివర్ణించిన శేషన్… వారిని కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు.. వీరి నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.. కానీ ఎన్నికల కమిషన్ బహుళ సభ్య సంస్థగా ఉండాలన్న రాజ్యాంగ నిబంధనలను ఎత్తిచూపులు సుప్రీంకోర్టు శేషన్ పిటిషన్ కొట్టేసింది. ఎక్కడైనా రాజకీయ అధికారమే సుప్రీం. ఒక దశ వరకే అది సోకార్డ్ స్వయం ప్రతిపత్తిని అనుమతిస్తుంది. ఇతర వ్యవస్థలు తమపై స్వారీ చేస్తే రాజకీయ వ్యవస్థ తట్టుకోలేదు. అవసరం అయితే సుప్రీంకోర్టు జడ్జిలను కూడా దింపేయగల సత్తా దానికి ఉంది.. స్వయంప్రతిపత్తికి పరిమితులుంటాయి. మన వ్యవస్థ గొప్పదనం అది. ఇన్ని చేసిన శేషన్ ఓ శేషం లా మిగిలిపోయి చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయాల అసలు తత్వం బోధపడి, కార్యనిర్వాక అధికారానికి, రాజకీయ అధికారానికి తేడా అర్థమై చివరికి తమిళనాడు వెళ్లిపోయారు. ప్రధాని పైన చర్య తీసుకోగల స్వయంప్రతిపత్తి ఉన్న సిఇసి కావాలనేది చెప్పడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు అంటే మోడీకి చేత కాకపోవచ్చు. కానీ రేపు పొద్దున మరో టెంపర్ మెంట్ ఉన్న ప్రధాని రాడు అని గ్యారెంటీ ఏమిటి? వస్తే ఎవరికి ఎలా కత్తర్లు పెట్టాలో, కీలు ఎరిగి వాత పెట్టాలో అతడికి తెలియదా ఏమి?