
ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలకు ఉన్న ప్రాధాన్యమేంటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. న్యాయవ్యవస్థ లేకపోతే అది నియంతృత్వ రాజ్యంగా మారిపోతుంది. ప్రశ్నించడం అనేదే ఉండదు. అధ్యక్ష తరహా ప్రభుత్వంగా మారిపోయి.. అధినేత ఆదేశించిందాన్ని నోరు మూసుకొని అమలు చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. అందుకే.. న్యాయవ్యవస్థ ప్రాధాన్యం ఎనలేనిది. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో కోర్టు తీర్పులకు విలువ లేకుండా పోతోందా? ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం కావడం.. కోర్టు వాటిని సస్పెండ్ చేయడం.. అనేది నిత్య కృత్యంగా మారింది. అయితే.. న్యాయస్థానం ఆదేశాలను పాటించకుండా.. తమ ఇష్టానుసారమే సర్కారు వ్యవహరిస్తోంది. ఇది ఒక్క కోర్టు విషయంలోనే కాకుండా.. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు సర్వత్రా ఇదే పరిస్థితి. దీంతో.. పిటిషనర్లు కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు. ఈ విధంగా అధికారులు, ప్రభుత్వంపై వేసిన కేసులు ఏకంగా 8 వేల వరకు ఉన్నాయని తేలడం సంచలనం కలిగిస్తోంది.
నిజానికి.. గతంలో ఈ పరిస్థితి లేదు. కోర్టు ఇచ్చిన తీర్పును సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు, అధికారులు అమలు చేసేవారు. కోర్టును ధిక్కరించడానికి సాహసించేవి కావు. ఏదో కారణంతో.. ఒకటీ రెండు ఉన్నా అవి నామమాత్రంగానే ఉండేవి. కానీ.. రానురానూ ఈ పరిస్థితి శృతిమించుతోంది. ఏకంగా ఎనిమిది వేల కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయంటే.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు ఆదేశాలను పాటించకపోయినా.. ఏమీ కాదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. కోర్టు ధిక్కరణ అనేది సాధారణమైన విషయం కాదు. అవసరమైతే జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఇద్దరు అధికారులకు శిక్ష కూడా విధించింది. తాజాగా.. సోమవారం కూడా స్కూళ్లలో గ్రామ సచివాలయాల నిర్మాణంపై కోర్టు ఆదేశాలను పాటించలేదని ముగ్గురిపై కోర్టు ధిక్కరణ చర్యలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులతో సమీక్షలో.. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం వల్ల పదే పదే కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో? చూడాల్సి ఉంది.