Jammu Reasi Attack: మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పర్యాటకుల బస్సు పై ఉగ్రవాదులు దాడి చేశారు.. 9 మంది దుర్మరణానికి, 42 మంది గాయపడేందుకు కారణమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా పరిగణించడంతో దర్యాప్తు వేగంగా మొదలైంది. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు 11 బృందాలుగా ఏర్పడ్డారు. భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. జమ్మూ రాష్ట్ర దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. తెరియాత్ లో దాడి జరిగిన ప్రదేశం లో కొన్ని ఆధారాలను దర్యాప్తు సంస్థ అధికారులు సేకరించారు. అక్కడ ఉన్న స్థానికులను విచారించారు.
53 సీట్ల సామర్థ్యం ఉన్న పర్యాటకుల బస్సు రియాసీలోని శివ్ ఖోరి ఆలయం నుంచి కత్రాకు బయలుదేరింది. ఆదివారం సాయంత్రం రియాసి ప్రాంతంలోని తెరియాత్ గ్రామంలో సాయంత్రం 6 గంటల పది నిమిషాలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో బస్సు లోయలోకి దూసుకెళ్లింది.. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లో దాక్కుని ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు డ్రోన్లు, క్వాడ్ కాఫ్టర్లు ఉపయోగిస్తున్నట్టు వివరించారు..” ఈ ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించాం. అక్కడ కొన్ని పాద ముద్రలను గుర్తించాం. బస్సు పై దాడిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వారి ఆచూకీ కనుగొనేందుకు మేము శోధనలు చేస్తూనే ఉన్నాం. ఆ సమీప ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని” ఉదంపూర్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ రయీస్ మహమ్మద్ భట్ ప్రకటించారు. ఆధారాల కోసం తాము చాలామంది సాక్షులను విచారించామని, వారు చెప్పిన వివరాల ప్రకారం అందులో లష్కరే హస్తం ఉన్నట్టు తేలిందని ఆయన ప్రకటించారు.
ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిలో రెండు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నారు. రెండు సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. జమ్ములోని రియాసీ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా ప్రశాంత వాతావరణం నెలకొంది. పూంచ్, రాజౌరి నుంచి నియంత్రణ రేఖ దాటి కాశ్మీర్లో లోయలోకి చేరుకున్న తర్వాత ఉగ్రవాదులు దీనిని రవాణా కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అమర్నాథ్ యాత్ర ముగింపు, సెప్టెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం… వీటికి ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.. దాడి జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందాలు ఆయుధాలు, ఇతర వస్తువులను కనుగొనేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. వారి ఇన్వెస్టి గేషన్ లో భాగంగా దాడి జరిగిన ప్రదేశం లో ఖాళీ షెల్ లు సేకరించారు. మరోవైపు గాయపడిన ప్రయాణికులతో జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారు.. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ఆయన ప్రకటించారు.
అయితే ఈ దాడి నేపథ్యంలో లష్కరే తోయిబా, జైశే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ లతో సంబంధం ఉన్న మూడు షాడో సంస్థలు.. తామే ఈ దారుణానికి పాల్పడ్డామని ప్రకటించాయి. ఆ తర్వాత ఆ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్, రివైనల్ ఆఫ్ రెసిస్టెన్స్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి సంస్థలు దాడిలో తమ ప్రమేయం ఉందన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. అయితే దీనికి వ్యతిరేకంగా జమ్ములో నిరసనలు చెలరేగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా పాలుపంచుకుంది. యాత్రికుల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. రియాసి ఘటన తర్వాత.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. కీలక ఆధారాలు లభించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం.. ఈ వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా పర్యవేక్షించడం.. ఏదైనా జరగొచ్చు అనే దానికి సంకేతాలని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Eight pilgrims killed in bus firing in jammu reasi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com