111 GO Removed: హైదరాబాదులోని రాజేంద్రనగర్ మండలంలోని ఓ గ్రామంలో ఓ ప్రముఖ సంస్థ ట్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్లతో ఒక బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. చదరపు అడుగును తొమ్మిది వేలకు పైన్నే విక్రయిస్తోంది. పేరుపొందిన ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వెంచర్లో చదరపు అడుగును కంపెనీ సూచించిన ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ముందస్తుగా ఐదు లక్షలు చెల్లించి ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. 111 జీవో ఎత్తివేసిన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ధరలు తగ్గాయని.. తాను అనవసరంగా 5 లక్షలు చెల్లించానని వాపోయాడు. ఒక వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్లు పెట్టాడు. ఇక కోకాపేట శివారులో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక బహుళ అంతస్తుల నివాస ప్రాజెక్టు నిర్మిస్తోంది. హెచ్ఎండిఏ,రెరా అనుమతులు రావడంతో ఆరు నెలల క్రితం నుంచి బుకింగ్లు ప్రారంభించింది. కొనుగోలుదారులు సంస్థ కార్యాలయానికి వచ్చి, వివరాలు ఆరా తీసి బుకింగ్ చేసుకున్నారు. గత నెల చివరి వరకు ఈ వ్యవహారం జోరుగా సాగింది. ప్రభుత్వం 111 జీవో ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో ప్లాట్లు బుకింగ్ చేసుకున్న వారు మొత్తం ధర తగ్గిస్తారా? అంటూ ఆ వెంచర్ నిర్మాణ సంస్థకు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీంతో ఆ నిర్మాణ సంస్థ లో ఆందోళన మొదలైంది.
జీవో రద్దుతో..
111 జీవో రద్దుతో వేలాది ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐటీ కారిడార్ లో ధరలు పడిపోతే.. బుకింగ్ చేసిన ఫ్లాట్ల ధరలు తగ్గిస్తారా? లేదా? అనే ఆందోళన కొనుగోలుదారుల్లో నెలకొంది. అయితే కోట్లు పెట్టి స్థలాలు కొని భారీ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. 111 జీవో తొలగింపు డెవలపర్లు, పలు నిర్మాణ సంస్థలకు పిడుగుపాటుగా మారింది. తమ ఫ్లాట్లు అమ్ముడు పోతాయా? లేదా? అనే కలవరం వారిలో మొదలైంది. అంతేకాదు అనుమతుల దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రారంభించాలా? వద్దా? అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి హైదరాబాద్ కు పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాలు రాష్ట్రంలోనే అత్యధిక ధర పలుకుతాయి. ఇక్కడ చదరపు గజం రెండు లక్షల పైనే ఉంటుంది. ఏడాది క్రితం కోకాపేటలోని భూములను హెచ్ఎం డి ఎ ఆన్ లైన్ లో వేలం వేయగా.. అత్యధికంగా 60 కోట్లు, అత్యల్పంగా 31 కోట్లు పలికింది.. అంటే ఎకరం సగటున నాలుగో కోట్లకు ఖరారైంది. కేవలం కోకాపేట మాత్రమే కాదు.. పుప్పాలగూడ, నార్సింగి, నానక్ రామ్ గూడ, మణికొండ, నల్లగండ్ల, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఎకరం కోట్లల్లో ఉండగా.. గజాలను లక్షల్లో విక్రయిస్తున్నారు. వాణిజ్యసముదాయం, రెసిడెన్షియల్ నిర్మాణం, ఐటీ కార్యాలయం ఇలా ఏది నిర్మించినా హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక గుర్తింపు దక్కుతుందని రాష్ట్రానికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు, డెవలపర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయి.. హైదరాబాద్కు పశ్చిమాన ఉన్న స్థలాలకు డిమాండ్ ఉండడానికి, ఆకాశాన్ని తాకేలా బహుళ అంతస్తులు నిర్మించేందుకు 111 జీవోనే కారణం.
ఐటీ కారిడార్ ఆనుకొని ఉండడంతో..
ఐటీ కారిడార్ ను ఆనుకొని జీవో ఏరియా ఉండడం వల్ల కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి, నానక్ రామ్ గూడ, ఖాజా గూడ, మణికొండ, నల్లగండ్ల, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో ఎకరం కోట్లకు చేరుకుంది. ఈ ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిన పెద్ద పెద్ద సంస్థలు బహుళ అంతస్తుల నిర్మాణాలకు వెనుకాడటం లేదు. కోకాపేటలో ఎకరాన్ని 40 కోట్లకు కొన్న పలు సంస్థలు 50 అంతస్థులకు పైగా భవనాలు నిర్మిస్తున్నాయి. చదరపు అడుగును ఎనిమిది వేల నుంచి 16 వేల వరకు విక్రయిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు దక్షిణ భారత దేశంలో 50 అంతస్థల భవనం బెంగళూరు నగరానికి మాత్రమే
పరిమితమైంది. కోకాపేట వేలం తర్వాత హైదరాబాదులోనే 50 అంతస్తుల ప్రాజెక్టులు 10 వరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కోకాపేట, పుప్పాలగూడ,నల్ల గండ్ల,నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో ఉన్నాయి. దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తైన భవనం 57 అంతస్తుల్లో కోకాపేట ప్రాంతంలో నిర్మితమవుతోంది.
భారీ ప్రాజెక్టులకు గండి
111 జీవో తొలగింపుతో ఐటీ కారిడార్ ఆనుకొని 1.32 లక్షల ఎకరాల వరకు భూమి లభ్యత ఏర్పడుతోంది. కోకాపేటలో ఇప్పటివరకు ఎకరం సగటు ధర 40 కోట్లు ఉంటే.. దాన్ని ఆనుకొని 111 జీవో పరిధిలో ఉన్న జన్వాడలో ఎకరం ధర 5 కోట్ల వరకు ఉండేది. అప్పటికి ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ అభివృద్ధి చేసే అవకాశం ఉండేది కాదు. తాజాగా జీవో తొలగింపుతో ఆ ప్రాంతం మాత్రమే కాదు దాని పరిధిలోని 84 గ్రామాల్లో భూమి రెట్టింపు ధర పలుకుతోంది. ఇది కోకాపేట తదితర ప్రాంతాల్లో భూమి డిమాండ్ తగ్గిస్తోంది. మొన్నటిదాకా కొనుగోలుకు నిర్ణయించిన ధరను ఇకపై పెట్టేందుకు ఈ ప్రాంతాల్లో వెనకడుగు వేసే పరిస్థితి ఉండేది కాదు. ఐటీ కారిడార్ ను ఆనుకొని ఉన్న జన్వాడ, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, గునుగుర్తి, ఖాన్ పూర్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశం కలుగుతుంది. ఐటీ కారిడార్ లోని ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే స్థలాలు దొరుకుతున్నాయి. 111 జీవో ఏరియాలో స్థలాలు కొనుగోలు చేసిన సంస్థలు ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించేందుకు అవకాశాలు ఉన్నాయి.