
అందరూ నడిచే దారిలో నడవదు ఈనాడు. అది ట్రెండ్ సృష్టిస్తుంది కానీ.. ఫాలో అవ్వదు. ఆ మధ్య ఓ రెండేళ్ల క్రితం జిల్లాల వారీగా ఎడిషన్లను ఎత్తివేసి తెలంగాణలో రెండు హైదరాబాద్, వరంగల్, ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో కేవలం రెండు మూడు జిల్లా ఎడిషన్లకు ప్లాన్ చేసింది. అది లీక్ అయ్యి సాక్షి ఎత్తివేసి చేతులు కాల్చుకుంది. ఆ పరిణామంతో ఈనాడు జిల్లాల ఎడిషన్లు ఎత్తివేయకుండా అలానే ఉంచుకుంది. నష్టపోయిందల్లా సాక్షినే. వరంగల్, హైదరాబాద్ కు వెళ్లకుండా మంచి మ్యాన్ పవర్ కోల్పోయి సాక్షి దెబ్బతింది.
ఇక ఇప్పుడు లాక్ డౌన్ వేళ దెబ్బతిన్న ఈనాడు పత్రిక సంస్థను కాపాడాలని జిల్లా సంచిక (టాబ్లాయిడ్)ను ఎత్తివేసింది. మెయిన్ పత్రికలోనే కలిపి కొడుతోంది. ఈనాడు ఫాలో కావడంతో జ్యోతి, సాక్షి, నమస్తే కూడా ఖర్చులు తగ్గుతాయని అవే అనుసరించాయి. ఈనాడు ట్రెండ్ ను ఫాలో అయ్యాయి.
అయితే మళ్లీ ఈనాడు మొదలు పెడితేనే జిల్లా టాబ్లాయిడ్స్ ను మొదలు పెడుదామని మిగతా పత్రికలన్నీ వేచి ఉన్నాయి. కానీ సడన్ గా ఈనాడును మనం ఫాలో కావడం ఏంటని అధికార సాక్షి, నమస్తే పత్రికలు తొడగొట్టాయి. మొన్న మే నెల మధ్యలోనే టాబ్లాయిడ్స్ ను స్టార్ట్ చేశాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.
తన ప్రధాన ప్రత్యర్థి అయిన సాక్షి జిల్లా సంచికలు ప్రారంభించడంతో అందరూ ఈనాడు తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా టాబ్లాయిడ్స్ తీస్తుందని అందరూ అంచనా వేశారు.కానీ పదిరోజులు గడుస్తున్నా వారి అంచనా తప్పింది. తలకిందులైంది. ట్రెండ్ సృష్టించడమే కానీ.. ఫాలో అవ్వడం తెలియని ఈనాడు మెయిన్ లోనే జిల్లా వార్తలను పెంచేసి సాక్షి, నమస్తేకు జలక్ ఇచ్చింది. ఇక ఈనాడును జ్యోతి పత్రిక ఫాలో అయ్యి అదీ కూడా టాబ్లాయిడ్స్ ను తీయడం లేదు.
ప్రస్తుతం కరోనా ఇంకా తగ్గలేదు. లాక్ డౌన్ ముగియలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు దమ్మిడి ఆదాయం లేదు. వ్యాపారులు రూపాయి ప్రకటనలు ఇచ్చే ధైర్యం ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయరు. ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది ఇంట్లో ఉన్నారు. కంపెనీలు అడ్వటైజ్ మెంట్లు ఇచ్చే యోచనలో లేవు. సో ఆదాయం లేని ఈ క్లిష్ట సమయంలో టాబ్లాయిడ్స్ తీసి అదనపు ఖర్చును భరించడం దండగ అని ఈనాడు, జ్యోతి భావించాయి. ఆ రెండు కమిట్ అయ్యి జిల్లా సంచికలను తీయకుండా సాక్షి, నమస్తే కు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఖర్చు బెట్టి తీసినా ఆదాయం, ప్రకటనలు వచ్చే అవకాశం లేకపోవడంతో భారం సాక్షి, నమస్తేలపై పడుతోంది. ఈనాడుది నిజంగానే అద్భుతమైన తెలివి అని.. బతకనేర్వడం ఎలాగో తెలుసని జర్నలిస్టు మిత్రుల్లో చర్చ నడుస్తోంది.