Raghu Rama Krishnam Raju: 40 కోట్లు ఫైన్.. రఘురామకు షాకిచ్చిన ఈడీ.. నిజాన్ని దాచేశారు

స్వతహాగా రఘురామకృష్ణంరాజు పారిశ్రామికవేత్త. ఆయనకు టిక్కెట్ ఇచ్చి నరసాపురం ఎంపీగా వైసిపి గెలిపించుకుంది. కానీ అదే పార్టీకి ఎదురు తిరిగారు ఆయన. పార్టీ నాయకత్వానికి బద్ధ శత్రువుగా మారారు. అటు రఘురామకృష్ణంరాజు సైతం వైసీపీ సర్కార్ వైఫల్యాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు.

Written By: Dharma, Updated On : November 25, 2023 12:31 pm

Raghu Rama Krishnam Raju

Follow us on

Raghu Rama Krishnam Raju: తప్పులు చేసేవారు తమ తప్పులు ఎరుగురంటారు. కానీ ఎదుటివారి చేస్తే మాత్రం వేలు చూపెడతారు. ముఖ్యంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన తప్పులు మరిచిపోయి.. ఏపీ సీఎం జగన్ తప్పులపై పడ్డారు. ఆయనపై ఏకంగా కోర్టులో కేసులు వేస్తున్నారు. ఆయన పాలన వైఫల్యాలు, పథకాల మాటున అవినీతి గురించి హైకోర్టులో.. అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పోరాడుతున్నారు. దానికి ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యమిస్తూ రఘురామ కృష్ణంరాజుకు విపరీతమైన కవరేజీ ఇస్తోంది. కానీ ఆయన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతోంది. మసి పూసి మారేడు కాయ చేస్తోంది.

స్వతహాగా రఘురామకృష్ణంరాజు పారిశ్రామికవేత్త. ఆయనకు టిక్కెట్ ఇచ్చి నరసాపురం ఎంపీగా వైసిపి గెలిపించుకుంది. కానీ అదే పార్టీకి ఎదురు తిరిగారు ఆయన. పార్టీ నాయకత్వానికి బద్ధ శత్రువుగా మారారు. అటు రఘురామకృష్ణంరాజు సైతం వైసీపీ సర్కార్ వైఫల్యాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు. టిడిపి నాయకులకు మించి విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తనకు కేంద్ర ప్రభుత్వం వద్ద పరపతి ఉందని.. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ.. జగన్ ను నియంత్రించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.అయితే ఆయనకు అంత సీన్ లేదని ఒక ఘటన ద్వారా తేలిపోయింది. ఆయన కంపెనీలకు సంబంధించి లోపాలపై ఈడి రూ.40 కోట్లు జరిమానా విధించినట్లు తెలుస్తోంది.ఆయనకు అంత పరపతి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అయితే రూ.40 కోట్ల జరిమానా ఈడి విధించినట్లు కనీసం ఎల్లో మీడియాలో వార్త రాలేదు. అటు సాక్షి సైతం దీనిని క్యాచ్ చేయలేకపోయింది. కానీ ఈ జరిమానాపై రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేయడంతో తప్పనిసరిగా వార్త ప్రచురితం చేయాల్సిన అవసరం ఎల్లో మీడియాకు వచ్చింది. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలపై ఈడి జరిమానా విధించినట్లు ఎల్లో మీడియా వెల్లడించాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ నెల 3న రఘురామకృష్ణంరాజు కంపెనీలకు ఈడి నోటీసులు ఇచ్చింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే నాడు అసలు ఎల్లో మీడియా ఈ వార్తను కవర్ చేయలేదు. అయితే ఈడి నిబంధనలను సవాల్ చేస్తూ రఘురామకృష్ణం రాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈడికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వార్తను ప్రచురించి రఘురామకృష్ణం రాజు కంపెనీలపై ఈడి జరిమానా అస్త్రాన్ని విధించినట్లు బయట పెట్టాల్సి వచ్చింది.

ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఆయన జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉండడమే కారణం. జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో ఎల్లో మీడియా ప్రాధాన్యమిస్తూ వస్తోంది. అటు కోర్టులో కేసులు వేసినా, ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు ఏకంగా రఘురామకృష్ణం రాజును లైవ్ లోకి తెచ్చి మాట్లాడిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణం రాజు ఉదయం లేచింది మొదలు.. పడుకునే వరకు ఆయనకు ఎనలేని కవరేజ్ ఇస్తున్న ఎల్లో మీడియాకు.. ఆయన కంపెనీలపై ఈడి జరిమానా విధించింది అన్న విషయం తెలియకపోవడం విచిత్రంగా ఉంది. ఎల్లో మీడియా అంతటి తెలివిని ప్రదర్శించగలుగుతోంది.