Minister Malla Reddy: ముల్లును ముల్లుతోనే తీయాలి అంటారు పెద్దలు.. అదే సూత్రాన్ని ఈడీ అధికారులు మల్లారెడ్డి, కుటుంబ సభ్యులపై ప్రయోగించారు. దీంతో వారి పని సులువు చేసుకున్నారు. నిన్నటి నుంచి సోదాలు చేస్తూనే ఉన్నారు. కీలక పత్రాలు, ఇంకా ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

స్కెచ్ వేశారు ఇలా
మంత్రి మల్లారెడ్డి కి వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విలువైన భూములు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. అయితే గత కొద్ది నెలలుగా ఈడి అధికారులు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు పరిశీలించుకుంటూ వస్తున్నారు.. వీరి కుటుంబ సభ్యులకు పలు జాతీయ బ్యాంకుల్లో 300కు పైగా ఖాతాలు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో మల్లారెడ్డి వైద్య కళాశాలల లావాదేవీల వివరాలు కూడా సేకరించారు.. అందులో భారీగా అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగకుండా ప్లాన్ బీ ప్రయోగించారు. మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని ఆయన వద్దకు తీసుకెళ్లారు. తమకు భూమి ఉన్నదని, అవసరాల రిత్యా అమ్ముతున్నామని మంత్రితో చెప్పారు.. బ్లాక్ మనీ అయినా ఇబ్బంది లేదని మంత్రితో స్పష్టం చేశారు. తాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదని మంత్రి వారికి బదులు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రికి సన్నిహితుడైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా మరిన్ని వివరాలు సేకరించి ఈడి అధికారులు రంగంలోకి దిగారు.
సంతోష్ రెడ్డి ఇల్లు తలుపులు పగలగొట్టారు
మంత్రి మల్లారెడ్డి కి ఆయన కొడుకు తర్వాత అత్యంత విశ్వాస పాత్రుడు సంతోష్ రెడ్డి.. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఈయన ఉంటాడు. మల్లారెడ్డి కి సంబంధించిన వైద్య కళాశాలల వ్యవహారాలు మొత్తం ఈయన చూస్తూ ఉంటాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కొన్ని ఆయన చేతిలో ఉండగా, మరి కొన్ని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అయితే వైద్య కళాశాలలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అయితే ఈ కళాశాలలకు సంబంధించి సమర్పించిన ఆదాయపన్ను వివరాల లెక్కల్లో తేడా ఉండడంతో ఈడి అధికారులు అప్పుడే దృష్టి సారించారు. వివరాలు సేకరించిన తర్వాతే రంగంలోకి దిగాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. మాంత్రికుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టు.. మల్లారెడ్డి గుట్టుమట్లు సంతోష్ రెడ్డికి తెలియడంతో ముందు అతని ఇంటికే ఈడి అధికారులు వెళ్లారు. అధికారులు వెళ్ళగానే సంతోష్ రెడ్డి తలుపులు తీయలేదు.. వారు పలుమార్లు చెప్పినప్పటికీ సంతోష్ రెడ్డి ఖాతరు చేయలేదు.. దీంతో అధికారులు తలుపులు పగల గట్టి లోపలికి వెళ్లి సోదాలు జరిపారు.. అదే సమయంలో మిగతా బృందాలు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేశాయి.

ఏం స్వాధీనం చేసుకున్నారు
నిన్నటి నుంచి జరుగుతున్న దాడుల్లో ఈడి అధికారులు కీలకమైన పత్రాలు, వివిధ రకాలైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సంతోష్ రెడ్డి ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం కూడా సోదాలు జరపడంతో మల్లారెడ్డి కొడుకు అడ్డుకున్నాడు. దీంతో సిఆర్పిఎఫ్ పోలీసులు అతడిని వారించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కొడుకు కింద పడ్డాడని తెలుస్తోంది. తన చాతికి నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో ఈడి అధికారులు పంపించారు. సమయంలో మల్లారెడ్డి తాను కూడా ఆసుపత్రికి వెళ్తానని ఈడీ అధికారులతో గొడవపడ్డాడు. ముందు వద్దని వారించిన ఈడి అధికారులు తర్వాత పంపించారు. అయితే ఇదే సమయంలో బోయినపల్లి మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు కొద్దిసేపు హడావిడి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అయితే పోలీసు రావడంతో అక్కడ గొడవ సద్దుమణిగింది.. మంత్రి మల్లారెడ్డి కి సంబంధించి విద్యాసంస్థల లావాదేవీల్లో తేడాలు ఉండడంతో ఆ దిశగా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది.