E.D Raids On TRS Leaders: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈడీ దాడులు చేస్తోంది.. మరీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసింది.. ఇప్పటికే కరీంనగర్ గ్రానైట్, మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసింది.. ఇది శాంపిల్ మాత్రమేనని… పెద్ద సినిమా ముందుందని చెబుతోంది.. దీనికి తోడు ఈడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు టిఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాక్షాత్తు మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి ఇంట్లో దాడులు చేస్తున్న సమయంలో.. “ఇంటికి తాళం వేసింది నేనే.. కానీ తాళం చెవి నా దగ్గర లేదు”.. అని చెప్పినా ఊరుకోలేదు.. “లాకర్ మాదే.. కానీ నేను అందుబాటులో లేను అని బతిమిలాడినా” పట్టించుకోలేదు.. “తలుపులు తీయను నా ఇష్టం” అని మాట్లాడినా బద్దలు కొట్టుకునే వెళ్లారు.

వెనక్కు తగ్గేది లేదు
అధికార టీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో వరుసగా సోదాలు నిర్వహిస్తున్న ఈడి అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. పైగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్పకుండానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెల్లవారుజామునే సోదాలు ప్రారంభిస్తూ అధికార పార్టీ నాయకుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కీలకమైన లాకర్లు, బీరువాలను తెరిచేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. వారికి చెల్లించే కూలీని కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచే వసూలు చేస్తున్నారు.. ఇటీవల మంత్రి గంగుల నివాసంలో లాకర్ ను, మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఆయన కళ్ళముందే బీరువాను స్థానికుల సహాయంతో తెరిపించారు.. విదేశాలకు గ్రానైట్ ఎగుమతిలో రూ. కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఈడి ప్రత్యేక బృందాలు.. కరీంనగర్ లోని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్ళాయి.. ఓ లాకర్ తెరిచేందుకు చాలాసేపు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. లాకర్ తాళం మంత్రి వెంట ఉంది.. ఆయన దుబాయ్ లో ఉన్నారు.. అధికారులు ఫోన్లో సంప్రదించగా.. “తక్షణమే తిరుగు ప్రయాణం అవుతున్నా… వచ్చాక లాకర్ తెరుస్తా”.. అని చెప్పారు.. కానీ ఈడీ అధికారులు లాకర్ వెంటనే తెరవాల్సిందేనని స్పష్టం చేశారు.. సమీపంలో తాళం చెవిలు మరమ్మతు చేసే వ్యక్తిని పిలిపించారు. పోలీస్ హడావిడి చూసి, గంగుల చెబితే కానీ తాళం తీయబోనని ఆ వ్యక్తి మొండికేశాడు. ఈడి అధికారులు మంత్రికి వీడియో కాల్ చేసి తాళం తీయమని సూచించాల్సిందిగా కోరారు. మంత్రి చెప్పాక అతడు ఆ పని పూర్తి చేశాడు.
మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లోనూ
మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లల్లో ఐటి అధికారులు ఏకకాలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు ప్రారంభించారు.. ఈ సందర్భంగా బీరువా తెరవాలని అధికారులు కోరగా… తాళంచెవి అందుబాటులో లేదని మంత్రి చెప్పారు.. ఆయన బంధు ఇంట్లోనూ ఐటీ అధికారులకు ఇదే పరిస్థితి ఎదురైంది.. దీంతో తాళం తీసే వ్యక్తిని ఆన్లైన్లో బుక్ చేసి పిలిపించారు.. అతడు మూడు బీరువాల తాళాలు తీశాడు.

వాటిలో దుస్తులు, కొన్ని పత్రాలు తప్ప, నగదు, నగలు కనిపించలేదు… అయితే సోదాల్లో లభించే ఏ చిన్న ఆధారమైనా దర్యాప్తు అధికారులకు కీలకం.. మల్లారెడ్డి ఇంట్లోని బీరువాల్లో దొరికిన పత్రాలను ఐటి అధికారులు పరిశీలించారు. కాగా ఐటీ అధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భంలో… మంత్రి బంధువు సంతోష్ రెడ్డి తలుపులు తీసేందుకు నిరాకరించారు. దీంతో వారు ఆ తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే ఆ పత్రాలు లభించాయో ఈడి అధికారులు మరింత లోతుల్లోకి వెళ్లారు.. అయితే వీటికి సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కుమారుడు సరైన సమాధానం చెప్పకపోవడం, వారికి ఎదురు తిరగడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముఖ్యంగా మల్లారెడ్డి నిర్వహిస్తున్న వైద్య కళాశాలల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఈడి అధికారులు గుర్తించారు.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.