
బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. దాన్ని లెక్కలోకి తీసుకొనే ఇప్పటిదాకా ప్రచారంలో మునిగిపోయారు. కానీ.. ఇంతలోనే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది కానీ.. ఎక్కడా ఉప ఎన్నికల గురించి ప్రస్తావించలేదు. గతంలోనూ బీహార్ ఎన్నికలతో పాటు దేశంలో ఏర్పడిన 60 ఖాళీ స్థానాలకూ ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెప్తూనే ఉంది. కానీ.. తాజాగా వాటి గురించి ఎక్కడా చెప్పలేదు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. వర్షాలు, కరోనా కారణంగా ఉపఎన్నికలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెబుతోంది.
Also Read: కల్వకుంట్ల కవిత రీఎంట్రీ.. ఏం జరుగనుంది?
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు మొదటి వారంలో చనిపోయారు. ఏ అసెంబ్లీ స్థానం నుంచైనా ఏ ప్రతినిధి చనిపోయినా.. ఆ ఖాళీ స్థానాన్ని ఆరు నెలల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బీహార్ ఎన్నికలతో పాటే ఉపఎన్నిక ఉంటుందని అందరూ భావించారు.
నెల రోజుల్లోనే ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్టానం ఆ ఉప ఎన్నిక బాధ్యతను హరీష్‌రావు నెత్తిన పెట్టింది. దీంతో ఆయన నిత్యం దుబ్బాకలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. హామీలూ ఇస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా ఈ సారి జోరు పెంచారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు.
Also Read: డిగ్రీ పూర్తి చేస్తే 50వేలు.. ఇంటర్ పాసైతే 25వేలు..
ఒకవిధంగా చెప్పాలంటే.. ‘కోడ్’ కూయకముందే.. అన్నట్లు పార్టీలు తమ ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శించాయి. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఉప ఎన్నికకు ఇంత హడావిడి కూడా ఎప్పుడూ కనిపించలేదు. కామన్‌గా..వారి కుటుంబ సభ్యుల్లో నుంచి ఒకరికి టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేసుకోవడం జరుగుతుంటుంది. కానీ.. ఈసారి ప్రతీపార్టీ కూడా బరిలో నిలుస్తామంటూ ప్రకటించాయి. దీంతో అక్కడ ఎన్నిక హాట్‌హాట్‌గా మారింది. అయితే.. ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటు ఇక్కడ ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఇక పార్టీ నాయకుల్లో ఊపు తగ్గనుంది.