Rahul Gandhi Vs EC: కొన్ని రోజులుగా భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని పేర్కొంటున్నారు. ఈసీ సహకారంతోనే దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాజాగా ఆయన కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపించారు. తండ్రిపేరు లేకపోవడం, ఒకే ఇంటి నంబర్‌పై పదుల సంఖ్యలో ఓటర్లు ఉండడం, కొందరి ఇంటిపేరు జీరో అని ఉండడం వంటివి అక్రమ ఓటర్లుగా చూపించారు. ఈ క్రమంలో ఈసీ వెబ్‌సైట్‌లో కొన్ని రాష్ట్రాల ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఈసీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సాంకేతిక సమస్యలే కారణమని సమాధానం ఇచ్చినప్పటికీ, స్పష్టత లోపించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
Also Read: మహేష్ బర్త్ డే వేళ రాజమౌళి అప్టేట్.. ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా.. !
రాహుల్‌గాంధీ ఆరోపణలు..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని, అక్రమ ఓట్ల ద్వారా బీజేపీ విజయానికి దోహదపడుతోందని ఆరోపించారు. తన వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, తప్పుడు ఓటర్ల జాబితాను ఉదహరిస్తూ ఈసీ నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్‌లో వైరల్ అయ్యాయి, దీంతో ఈసీపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈసీ వెబ్‌సైట్‌లో బిహార్, మహారాష్ట్ర, హర్యానా వంటి కీలక రాష్ట్రాల ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ మద్దతుదారులు ఈసీ ఈ జాబితాలను ఉద్దేశపూర్వకంగా తొలగించిందని, రాహుల్ గాంధీ ప్రశ్నలకు భయపడి ఈ చర్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల ఓటరు జాబితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ అసమానత ఈసీపై అనుమానాలను మరింత పెంచింది.
స్పందించిన ఈసీ..
ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఈసీ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటరు జాబితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, కొందరు స్వతంత్రంగా క్రాస్–చెక్ చేసినప్పుడు బిహార్, హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల ఎలక్టోరల్ రోల్స్ పీడీఎఫ్‌లు అందుబాటులో లేనట్లు తేలింది. ఈసీ ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో, ఇది సాంకేతిక సమస్య కావచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఓటరు జాబితాలు కొన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండగా, మరికొన్ని రాష్ట్రాలకు లేకపోవడం ఒక సాంకేతిక లోపంగా కనిపిస్తోంది. అయితే, ఈసీ ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం, ఆరోపణలను కేవలం ‘‘తప్పుడు ప్రచారం’’గా కొట్టిపారేయడం ప్రజలలో అనుమానాలను మరింత పెంచుతోంది. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని నిరూపించుకోవాలంటే, ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి, ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించాలి.
ఈ వివాదం రాజకీయంగా కాంగ్రెస్‌కు ఒక ఆయుధంగా మారింది. ఈసీపై ఒత్తిడి పెంచడం ద్వారా, బీజేపీ నియంత్రణలో ఈసీ ఉందనే వాదనను కాంగ్రెస్ బలపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈసీని ట్రోల్ చేయడం, ఈ ఆరోపణలను వైరల్ చేయడం ద్వారా ప్రజలలో ఈసీ విశ్వసనీయతపై చర్చను రేకెత్తించారు. అయితే, ఈసీ సమర్థవంతంగా స్పందించి, సాంకేతిక సమస్యలను సరిదిద్ది, పారదర్శకంగా వివరణ ఇస్తే ఈ వివాదాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఉంది.