
ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైపోయింది. ఈటల కాషాయ కండువా కప్పుకోవడం టీఆర్ఎస్ కు మైనస్సే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గులాబీ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత లిస్టు తీసినప్పుడు కేసీఆర్ ముందు వరసలో ఉంటారు. అలాంటి నేత.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే పార్టీలోకి వెళ్లడం వల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అది రెండు విధాలుగా ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు.
ఈటలను అన్యాయంగా బర్తరఫ్ చేశారని, ఉద్దేశపూర్వకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలు చేపట్టారని జనాల్లో కూడా రిజిస్టర్ అయ్యింది. ఈ కారణం చేతనే హుజూరాబాద్ లో చాలా మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల వెంట నిలబడ్డారు. కాబట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని, ఇది కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు.
ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ బలం, జోష్ పెరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికతో పైచేయి తమదేనని టీఆర్ఎస్ చాటుకుంది. ఇప్పుడు ఈటల చేరికతో.. మళ్లీ దూకుడు కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించాలని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ప్రయత్నాలకు ఈటల చేరిక తప్పుకుండా బలం చేకూరుస్తుందని అంటున్నారు.
ఇక, మరోవైపు చూసినప్పుడు ఈటల 20 ఏళ్లుగా కేసీఆర్ వెంట ఉన్నారు. టీఆర్ఎస్ పుట్టిక నుంచీ ఉన్నారు. అందువల్ల.. కేసీఆర్ రాజకీయ, వ్యక్తిగత విషయాలు చాలా వరకు ఆయనకు తెలుసు. అవి ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఈటల పార్టీ మారితే పరిస్థితి వేరేవిధంగా ఉండేది. కానీ.. అవమానకరంగా ఆయన్ను మంత్రివర్గం నుంచి బయటకు పంపారు. తన వ్యక్తిత్వాన్ని చంపేశారని ఆవేదన వ్యక్తంచేశారు ఈటల.
కాబట్టి.. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన వెనకడుగు వేయరని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా కొత్త రూపు తీసుకుంటాయని చెబుతున్నారు. మరి, ఈటల చేరిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటీ? వాటిని కేసీఆర్? ఎలా ఎదుర్కొంటారు? అన్నది చూడాలి.