Homeజాతీయ వార్తలుEAtala Rajender: రాజేందర్ బీజేపీకి సికిందర్ కాబోతున్నాడా?

EAtala Rajender: రాజేందర్ బీజేపీకి సికిందర్ కాబోతున్నాడా?

EAtala Rajender: టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్న సమయంలో ఈటల రాజేందర్ కు అమిత్ షా ఇచ్చిన హామీలు ఏంటి? హుజరాబాద్ లో గెలిచాక ఈటెల రాజేందర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? భారీ సమావేశాలు తప్ప మిగతా కార్యక్రమాల్లో ఈటల రాజేందర్ ఎందుకు కనిపించడం లేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి, ఈటల రాజేందర్ కి మధ్య గొడవలు ఉన్నాయా? అవి తారాస్థాయికి చేరి ఎడమొహం పెడమొహం పెట్టుకునే దాకా వెళ్లిందా? ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తో కలిసి పార్టీ పెట్టాలనుకున్నారా? ఇవి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు. కొన్నిసార్లు ఇవి నిజం అవుతాయేమోనన్న సంకేతాలు వినిపించాయి. కానీ వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆదివారం ఈటల రాజేందర్, తన ఆప్త మిత్రుడు ఏనుగు రవీందర్ రెడ్డి తో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. సుదీర్ఘ సమయం వరకు మంతనాలు జరిపారు. అసలు ఈటెల రాజేందర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? మొన్ననే అమిత్షా హైదరాబాద్ వచ్చారు. నెల సమయం కాకుండానే ఈటల రాజేందర్ ను ఢిల్లీకి ఎందుకు పిలిపించారు? ఇటీవల పార్టీ కి కొంచెం దూరంగా ఉంటున్న రాజేందర్ ను పూర్తిగా వినియోగించుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేశారన్న వాదనల్లో వాస్తవం ఎంత?

EAtala Rajender
EAtala Rajender


హుజరాబాద్ లో గెలిచాక

టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన హుజరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. తనను ధిక్కరిస్తే తట్టుకోలేని కేసీఆర్ ఏకంగా ఈటల రాజేందర్ ఓడించాలని కంకణం కట్టుకున్నారు. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు అనే పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపణలు లేకపోలేదు. అప్పట్లో ఈటల రాజేందర్ కోసం బండి సంజయ్ నుంచి ధర్మపురి అరవింద్ వరకు అందరూ ప్రచారంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే ఈటల రాజేందర్ మళ్లీ హుజరాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈటెల రాజేందర్ మైలేజ్ బాగా పెరిగింది. సభలు సమావేశాలు నిర్వహించినపుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కాబోయే సీఎం ఈటల రాజేందర్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సందర్భాల్లో ఆయన అనుచరులు కూడా ఇదే మాటను నొక్కి వక్కాణించారు. ఈ మాటలు బండి సంజయ్ చెవిన పడటంతో ఆయన ఈటల రాజేందర్ ను దూరం పెట్టడం ప్రారంభించారని సమాచారం. అయితే కొన్ని సందర్భాల్లో తన అనుచరులకు టిక్కెట్ ఇప్పిస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మాట కూడా బండి సంజయ్ దాకా వెళ్లడంతో ఆయన ఒక సమావేశంలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని,ఆ అధికారం నాతో సహా ఏ నాయకులకూ లేదని కుండ బద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు ఈటల రాజేందర్ ను ఉద్దేశించే బండి సంజయ్ చేశారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం బాగా జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య దూరం బాగా పెరిగిపోయింది. పైకి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం అగాధం అలానే ఉండిపోయింది. ఈ పరిణామంతో ఈటల రాజేందర్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో పార్టీలో మీరు ఇమడలేక పోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ” నేను టీఆర్ఎస్ నుంచి వచ్చిన. టీఆర్ఎస్ విధానం వేరు. బీజేపీ విధానం వేరు. ఇక్కడ పార్టీ విధానానికి సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది” అని ఆయన సమాధానం ఇచ్చారు. పార్టీకి తాను కొంచెం దూరంగా ఉంటున్నానని చెప్పకనే చెప్పారు.

Also Read: Ram Warrior Movie: విడుదలకి ముందే రికార్డ్స్ సృష్టించిన రామ్ ‘వారియర్’.. రామ్ రేంజ్ ఇంతలా పెరిగిందా !

తుక్కుగూడ సభలోనే గుర్తించారా?

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సమావేశం ఇటీవల తుక్కుగూడ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అంత కంటే ముందు బీజేపీ పదాధికారులు, ముఖ్య నాయకులతో నోవాటెల్ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఈటెల రాజేందర్ ముభావంగా ఉండడం గమనించి అందుకు గల కారణాలను ఆయన తెలుసుకోవడం ప్రారంభించారు. మొదట్లో బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు తరుణ్ చుగ్ ను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఇలాంటి బేధాభిప్రాయాలు ఉంటే పార్టీకి నష్టం జరిగుతుందని భావించిన అమిత్ షా జేపీ నడ్డా ను కాదని తానే ఈటల రాజేందర్, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ని ఢిల్లీకి పిలిపించుకున్నారు.

EAtala Rajender
Rajender


పార్టీలో కీలక స్థానం ఇస్తారా?

రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ బీజేపీ రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది. రూరల్ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఇంకా విస్తరించాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఈటల రాజేందర్ తో భర్తీ చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అమిత్ షా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకోవడం, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించడం, పార్టీ బలాలు, బలహీనతలు గురించి తెలుసుకొన్నారు. ఈటల రాజేందర్ ద్వారానే పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టి గట్టి ఓటు బ్యాంకును నిర్మించుకునేలా చేయాలని అమిత్ షా తలపోస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులందరి సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ కు మంచి పేరు ఉంది. ఏపీలోనూ ఈటల రాజేందర్ కరడుగట్టిన అభిమానులు ఉన్నారు. పైగా బీసీ సామాజిక నేపథ్యం ఉండటంతో ఈటల రాజేందర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతారు. ఈటల రాజేంద్ర కున్న క్రేజ్ ను వాడుకొని పార్టీలో కీలక పదవి కట్టబెట్టి తద్వారా దక్షిణాదిలో రెండో రాష్ట్రంలో పాగా వేయాలని అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే రాజేందర్ ను బీజేపీకి సికిందర్ ను చేయాలని యోచిస్తున్నారు.

Also Read: Singer Sunitha Daughter: సింగర్ సునీత కూతురిని చూశారా ఎంత అందంగా ఉందో… హీరోయిన్స్ ఏం సరిపోతారు!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular