Homeఆంధ్రప్రదేశ్‌Janasena- Kapu Community: జనసేన వైపు తూర్పుకాపులు టర్న్..పవన్ భారీ స్కెచ్

Janasena- Kapu Community: జనసేన వైపు తూర్పుకాపులు టర్న్..పవన్ భారీ స్కెచ్

Janasena- Kapu Community: తూర్పుకాపులు పునరాలోచనలో పడ్డారా? ఇన్నాళ్లూ పార్టీలు తమను రాజకీయంగా వాడుకున్నాయని భావిస్తున్నారా? పవన్ తోనే తమకు న్యాయం జరుగుతందని భావిస్తున్నారా? జనసేన వైపు టర్న్ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తూర్పుకాపులు అధికం. సంఖ్యాబలంగా మిగతా సామాజికవర్గాల కంటే అదనం. కానీ ఒకరిద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టి తూర్పుకాపు సామాజికవర్గాన్నంతటినీ పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే బొత్స సత్యనారాయణ, టీడీపీ అధికారంలోకి వస్తే కళా వెంకటరావుకు మంత్రి పదవులు కట్టబెట్టి సామాజిక లెక్కలు కట్టి మీకు న్యాయం చేసేశామని చెబుతూ వస్తున్నారు. ఒకరిద్దరు కోసం సామాజికవర్గాన్ని ఇతర కులాల నాయకుల వద్ద తాకట్టు పెట్టేస్తున్నారు. వెనుకబాటు అన్న ముద్రతో తూర్పుకాపులుగా గుర్తించి మూడు జిల్లాలకే పరిమితం చేశారు. ఆ మూడు జిల్లాల తూర్పుకాపులకే ఓబీసీలుగా గుర్తిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉన్న తూర్పుకాపులకు మొండిచేయి చూపుతున్నారు.

Janasena- Kapu Community
pawan kalyan

తాజాగా తూర్పుకాపు సామాజికవర్గ నేతలు, విద్యాధికులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారితో తన ఆలోచనలను పంచుకున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో తూర్పుకాపులు ఉన్నారు. కానీ శ్రీకాకుళం,విజయనగరం, విశాఖలోని తూర్పుకాపులనే బీసీలుగా గుర్తించడాన్ని గుర్తుచేశారు. ఇది ముమ్మాటికీ దగా చేయడమేనని ఆరోపించారు. తూర్పుకాపులను విడగొట్టి ఆస్థిరపరచడమేనన్నారు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నవారిలో ఐక్యత లేదని.. తక్కువ ఉన్నవారిలో ఐక్యత ఎక్కువ అని.. దాని ఫలితాలు, పర్యవసానాలే ఏపీలో రాజకీయ పెత్తనంగా అభివర్ణించారు. తూర్పుకాపులకు బొత్స పెద్ద నాయకుడే కావచ్చు. కానీ ఆయన అధినాయకత్వాన్ని లొంగాలి. అప్పుడే పవర్ కొనసాగుతుంది. లేకుంటే దూరం కావాల్సిందేనన్నారు. ఈ పరిస్థితికి తూర్పుకాపుల్లోఐక్యత లేకపోవడమే కారణమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకుండా అంతా జనసేనకు అండగా నిలబడితే మాత్రం తూర్పుకాపులు రాష్ట్రంలో నిలబడగలగుతారని చెప్పారు. జనసేన మీకు న్యాయం చేస్తుందని అనుకుంటే మాత్రం సపోర్టుగా నిలవాలని విన్నవించారు.

అయితే గత కొద్దిరోజులుగా జనసేన ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ప్రధానంగా తూర్పుకాపులను టార్గెట్ చేస్తూ వ్యూహాలు పన్నుతోంది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తూర్పుకాపుల ప్రాబల్యం ఎక్కువ. గత ఎన్నికల్లో వారు వైసీపీ అండగా నిలిచారు. ఆ పార్టీ వైట్ వాష్ వెనుక తూర్పుకాపుల మద్దతే కారణం. అయితే గత మూడున్నరేళ్లుగా జరిగిన పరిణామాలతో తూర్పుకాపులు అధికార పార్టీపై కోపంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా ఒకరిద్దరికి పదవులు అందించి కులానికి ఏదో చేశామని స్టేట్ మెంట్లు ఇవ్వడం వారికి రుచించడం లేదు. పైగా తూర్పుకాపు సామాజికవర్గానికి అంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చే ఒక్క పదవీ కేటాయించలేదు. పైగా కులం ప్రాబల్యమున్న నియోజకవర్గాలను ఎస్టీ, ఎస్టీలకు రిజర్వ్ చేయడం.. ఇతర కులాల నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం, నామినేట్ పదవుల్లో మొండిచేయి వంటి వాటితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వారంతా ప్రత్యామ్నాయంగా జనసేనను చూడడం ప్రారంభించారు.

Janasena- Kapu Community
Janasena- Kapu Community

ఇటీవల పవన్ విజయనగరంలో పర్యటించారు. జగనన్న కాలనీ లేఅవుట్లో అవినీతిని వెలికి తీసేందుకుగాను నిర్వహించిన జనసేన సోషల్ ఆడిట్ విజయనగరంలోని గుంకలాం లేఅవుట్ నుంచే ప్రారంభించారు. కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. అటు పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ సైతం ఉత్తరాంధ్రలో పర్యటించారు. తూర్పుకాపులు, మత్స్యకారుల సమన్వయమే అజెండాగా మనోహర్ పర్యటన సాగింది. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, మత్స్యకారులను జనసేన వైపు టర్న్ చేసేలా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version