Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలను గమనించిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు అలెర్టు చేస్తుండడంతో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వైసీపీ వ్యవహార శైలిని పసిగట్టిన చంద్రబాబు ఇప్పటి నుంచి తాను ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా. నేతలంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేలా పనిచేయాలని సూచించారు. దీంతో ముందస్తు తప్పవన్న నిర్థారణకు టీడీపీ నేతలు వచ్చేశారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు తాను జిల్లాల పర్యటనలను మొదలెడుతున్నట్టు తెలిపారు. తొలుత మీ జిల్లాలో రోడ్డు షో లు మొదలుపెడతానని చెప్పారు. జగన్ తీరు చూస్తుంటే ముందస్తుకు వెళ్లడం ఖాయంగా తెలుస్తున్నందున.. ఎట్టి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ తీసుకోకూడదని భావిస్తున్నట్టు చెప్పారు.

అయితే చంద్రబాబు మరో కోణంలో కూడా పార్టీ నేతల వద్ద విశ్లేషించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది కర్నాటకతో పాటు తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో మేలో, తెలంగాణలో డిసెంబరులో ఎన్నికలయ్యే అవకాశముంది. ఆ రెండు ఎన్నికల్లో ఏదో ఒకదానిని జగన్ ఎంచుకునే అవకాశముందని చంద్రబాబు అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే పక్కా సమాచారం లేకుండా చంద్రబాబు అలెర్ట్ చేయరు. అధినేత నుంచి ఆదేశాలు వచ్చేసరికి పార్టీ శ్రేణులు కూడా యాక్టివ్ అవుతున్నాయి. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమంతో దూకుడుమీదున్న టీడీపీ శ్రేణులు మరింతగా ప్రజల్లోకి ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
వాస్తవానికి ముందస్తు ఎన్నికల ఊహాగానం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి, వైసీపీ సర్కారుకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ముందస్తు ఊహాగానాలు వస్తునే ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం జగన్ సీరియస్ గా దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వైసీపీ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. మరోవైపు రాజకీయ ప్రతికూల పరిస్థితులు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు కష్టతరంగా మారుతోంది. అటు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది. అందుకే ముందస్తుకు వెళ్లడం ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. నియోజకవర్గాల రివ్యూ చేస్తున్నారు. టీడీపీ సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అటు చంద్రబాబు కూడా 114 నియోజకవర్గాల రివ్యూలు పూర్తి చేశారు. అటు జగన్, ఇటు చంద్రబాబు హడావుడి చూసిముందస్తు తప్పదని అధికార, విపక్ష పార్టీ ల శ్రేణులు ఒక డిసైడ్ కు వస్తున్నాయి.