Early Elections In AP: ముందస్తు ఎన్నికలు రానున్నాయా? ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు వెళితేనే మేలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ముందస్తు ఆలోచనేదీ లేదని చెబుతూ వస్తున్న వైసీపీ తొలిసారిగా ముందస్తుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఆ పార్టీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి విషయాన్ని ధ్రువీకరించడంతో మందస్తు తప్పదని భావిస్తున్నారు. ఏడాది తరువాతో లేకుంటే నిర్ణీత గడువుకు ఆరు నెలల ముందో ఎన్నికలకు వెళతామని సజ్జల చెప్పడం ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు జగన్ అనుమతి లేకుండా సజ్జల ప్రకటించారన్న వాదన ఉంది. మామూలుగా అయితే ఏ విషయాన్ని సజ్జల బయటకు చెప్పరు. కానీ ముందస్తు సంకేతాలు పంపాలని అనుకున్నారు కాబట్టే చెప్పారని భావిస్తున్నారు. మాములుగా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వచ్చే చాన్స్ లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ద్వతీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ ఆరు నెలల ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అందుకే కొత్తగా ఏడాదిలో ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు. ముందస్తు గురించి ఇటీవల మంత్రులు కూడా అదే పనిగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాల్లో ఎవరూ అడగకపోయినా ముందస్తు ఉండదంటూ చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిపాలనా.. ఆర్థిక .. రాజకీయ పరిస్థితులను చూస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారమని టీడీపీ కూడా నమ్ముతోంది. అందుకే రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఏపీలో పార్లమెంట్‌తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్రం సహాయ నిరాకరణ
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. అప్పులు చేస్తామన్నా అనుమతించడం లేదు. అప్పులు చేయనిదే పూట గడవని స్థిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతీ నెల ఐదో తేదీ దాటితే కానీ జీతాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పైగా చేసిన అప్పులకు కచ్చితంగా సహేతుక కారణాలతో పాటు లెక్కలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీచేస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. నవరత్నాలతో పాటు పాలనను సజావుగా జరిపించడానికి నెలకు రూ.5 వేల కోట్లకు పైగా అవసరం. కానీ ఆదాయం అందుకు తగ్గట్టు లేదు. అందుకే అప్పులే శరణ్యంగా భావిస్తోంది. కానీ బ్యాంకులు సైతం అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అలాగని సంక్షేమ పథకాలు నిలిచిపోతే ప్రజల వద్ద చులకన అయిపోతామని జగన్ సర్కారు భావిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే పుట్టు మునగడం ఖాయమన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. అందుకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళితేనే కాస్తా ప్రయోజనమని భావిస్తోంది.
విపక్షాల దూకుడు
మరో వైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేనలు కలుస్తాయన్న ప్రచారం కలవరపెడుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. పొత్తుల సంకేతాలను పంపుతున్నారు. ఈ సమయంలో విపక్షాలకు సమయం ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే ప్రయోజనమని జగన్ భావిస్తున్నారు. మరోవైపు అమ్మ ఒడి, రైతుభరోసా వంటి పథకాల అమలుకు భారీగా సొమ్ము అవసరం. రాష్ట్ర ఖజానా పరిస్థితి చూస్తుంటే ఏమంత ఆశాజనకంగా లేదు. అలాగని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఏ మాత్రం ఆలస్యమైనా ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్నారు. దిగువ స్థాయిలో వ్యతిరేకత చేరక ముందే ఎన్నికలకు వెళితేనే బాగుంటుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ కిశోర్ చేసిన సర్వేలో కూడా ఇదే తేటతెల్లమైంది. అందుకే జగన్ ముందస్తుకు ప్రిపేరవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల్లో ముందస్తుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.