ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన విజయవాడ దుర్గమ్మ సన్నిధిని రాజకీయ వేదికను చేస్తున్నారు మన రాజకీయ నేతలు. భక్తుల దర్శనార్థానికి ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. నిత్యం రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆలయ పవిత్రతను ఈవో, ఇతర అధికారులు వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఆలయ ప్రతిష్ఠను కాపాడాల్సిన దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కూడా రాజకీయ ప్రాధాన్యత సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు ఆలయ స్టాఫ్ కోసం ఓ పరిపాలనా కార్యాలయాన్ని కేటాయిస్తుంటారు. కానీ.. దుర్గ గుడిలోని ఆ కార్యాలయం కాస్త ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు అడ్డాగా మారిందట. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆ కార్యాలయాన్ని వదిలి వెళ్లడం లేదట. పార్టీ సమావేశాలకు ఈ కార్యాలయాన్ని వేదికగా మార్చేశారట. నిన్న కూడా దుర్గగుడి పరిపాలనా కార్యాయల భవనంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దుర్గగుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, మంత్రి ముఖ్య అనుచరులు కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావు నేతృత్వంలో జరిగింది.
Also Read: ఆదాయం పెంచుకునేందుకు ఏపీ సర్కార్ కొత్త ‘దారులు’
ఇటీవల బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ జగన్ పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీసీలను తమ వైపు ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు ర్యాలీలు నడిపిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలోనూభారీ ర్యాలీ తీశారు. ఇక ఇదే ఊపులో నియోజకవర్గాల వారీగా ర్యాలీల నిర్వహణకు వైసీపీ నాయకులు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమావేశం నిర్వహించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్టీ సమావేశానికి దుర్గగుడి పాలనా కార్యాలయాన్ని వాడుకోవడం విమర్శలకు దారితీసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యంగా ఈవో సురేశ్‌బాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆలయ పవిత్రత మంటగలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆలయ సొమ్ముతోనే ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఒకట్రెండు సార్లు మంత్రి వెల్లంపల్లి ఈ పరిపాలనా కార్యాలయాన్నే వేదికగా వాడుకున్నారు. తాజాగా.. మరోసారి మీటింగ్ పెట్టడంపై భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆంధ్రులూ.. తెగించాల్సిన టైం వచ్చింది!
ఈ ఏడాది మే 17న పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులతో మంత్రి వెలంపల్లి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కూడా దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలోని సమావేశ మందిరాన్నే వేదికగా చేసుకున్నారు. నాటి సమావేశానికి ఈవో సురేశ్‌బాబు, వీఎంసీ ఎస్టేట్ అధికారి శ్రీధర్ కూడా హాజరవ్వడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి పరిపాలనా కార్యాలయంలో రాజకీయ సమావేశం నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.