DSP Transfers In AP: ప్రతిభ, సమర్థత, నిజాయితీ, పనితీరు.. ఇవే అధికారులు, ఉద్యోగులకు కొలమానాలు. వీటిని గీటురాయిగా చూసి పదవులు, పదోన్నతులు, బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఏపీలో ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తోంది. తమకు పనికొచ్చాడని, పనికొస్తాడని, తమ సామాజికవర్గానికి చెందిన వాడని.. ఇలా రకరకాల అర్హతా ప్రమాణాలు చూపి పదవులు కల్పిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కొలువుల వరకూ ఏం చేసినా సరిపెట్టుకోవచ్చు. కానీ శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ శాఖలో ఆశ్రిత పక్షపాతం, రాజకీయ లబ్ధి,కుల ప్రయోజనాలు చూడడం మాత్రం దేనికి సంకేతం. తాజాగా ఏపీలో డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 53 మంది డీఎస్పీల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. 30 సబ్ డివిజన్లలో డీఎస్పీలను బదిలీ చేస్తూ కొత్తవారిని నియమించారు. అయితే ఇందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 11 మందికి ఏకపక్షంగా పోస్టింగులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 30 మందిలో 11 మంది అంటే 37 శాతం ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఒకే సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలను విపక్షంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న నాయకుల ప్రాంతాలకు పంపడం మాత్రం పక్కా పొలిటికల్ గా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానాలకు తావిస్తోంద

సాధారణంగా డీఎస్పీల బదిలీలు రెండేళ్లకోసారి జరగుతాయి. ఈ లెక్కన ఇప్పుడు నియమితులైన వారు మరో రెండేళ్ల పాటు అక్కడే కొనసాగుతారు. షెడ్యూల్ ప్రకారం 2024 లో ఎన్నికలు జరిగినా.. అంతకంటే ముందస్తుగా జరిగినా వీరే పోస్టుల్లో ఉంటారు. అటు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తారనే ఏరికోరి ఒకే సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలను ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఇలా ఎంపిక చేసిన వారిలో చాలా మందికి అధికార పార్టీ అంటే చాలా గౌరవం. గతంలో కూడా వీరు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు ఆరోపణలున్నాయి. పైగా కులాభిమానం ఎలానూ ఉంటుంది. దీంతో వీరు పక్కాగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని.. కావాలని నియమించుకున్నారని మిగతా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పుడు ఆరోపణ చేసింది విపక్ష వైసీపీ. అటు ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఏకంగా ఫిర్యాదులు సైతం చేసేశారు. కానీ నాడు పారదర్శకంగానే డీఎస్పీల నియామకాలు, పదోన్నతులు జరిగాయని సాక్షాత్ వైసీసీ హోం మంత్రి మేకతోటి సుచరిత శాసనసభలో ప్రస్తావించారు. కానీ నాడు దుష్ప్రచారంతో టీడీపీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలకు పెద్దపీట వేశారని ప్రచారంచేయడంలో నాటి విపక్ష వైసీపీ సక్సెస్ అయ్యింది. కానీ నాడు 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఎస్టీకి చెందిన ఒకరికి డీఎస్సీలుగా అవకాశమిచ్చినట్టు అసెంబ్లీ వేదికగా వైసీపీకి చెందిన హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో నాటి ఆరోపణలు ఉత్తివేనని తేలిపోయింది.

అయితే ఇప్పుడు అవే ఆరోపణలు వైసీపీ సర్కారుపై వచ్చిపడుతున్నాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి పోస్టింగులు ఇవ్వడం ఒక వంతు అయితే.. వివాదాస్పదులైన ఒకే సామాజికవర్గం డీఎస్పీలకు స్థాన చలనం లేకపోవడం విస్తు గొల్పుతోంది. రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం ఎస్పీ మాధవరెడ్డి వ్యవహార శైలి ఇటీవల వివాదాస్పదమైంది. హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై అమానుషంగా, అత్యంత కర్కశంగా వ్యవహరించారు. పాదయాత్ర సజావుగా పూర్తిచేసే బాధ్యతలు పోలీస్ శాఖవేనన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ఇద్దరు డీఎస్పీలను మాత్రం యథాస్థానంలో కొనసాగించారంటే.. అంతా ఓ ప్రణాళికాబద్ధంగా.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమేనని తెలుస్తోంది.