Homeఅంతర్జాతీయంDravidian Languages : భారత భాషాలు ఎలా పుట్టాయి.? ఎక్కడి నుంచి ఉద్భవించాయి?

Dravidian Languages : భారత భాషాలు ఎలా పుట్టాయి.? ఎక్కడి నుంచి ఉద్భవించాయి?

Dravidian Languages : భారతదేశ ఉపఖండంలో ప్రధానంగా రెండు పెద్ద భాషా కుటుంబాలు ఉన్నాయి. అవి ఉత్తర భారతదేశంలో ఆధిపత్యం వహించే ఇండో-ఆర్యన్ భాషలు.. దక్షిణాన పాతుకుపోయిన ద్రవిడ భాషలు. ఈ రెండు కుటుంబాలు తమదైన లిపి, పదజాలం , వ్యాకరణ నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

ద్రవిడ భాషా కుటుంబం: ఒక ప్రత్యేక ప్రపంచం

మన దక్షిణ భారతదేశంలో మాట్లాడే తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం వంటి భాషలు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి. ఇవి కాకుండా తులూ, కొడగ, గదబ, ఒల్లారి, కుయి, కువి వంటి అనేక ఉప-భాషలు కూడా ఈ కుటుంబంలో భాగమే. ఈ భాషలన్నిటికీ ఉత్తర భారతదేశంలోని ఇండో-ఆర్యన్ భాషలతో ప్రత్యక్ష సంబంధం లేదు, ఇవి తమదైన ప్రత్యేకమైన మూలాన్ని, ఉనికిని కలిగి ఉన్నాయి. ఈ భాషలన్నిటికీ ఉమ్మడిగా ఒక మూల ద్రావిడ భాష ఉండేదని భాషాశాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మూల భాషకు దగ్గరగా ఉండే రూపం నేటి తమిళంలో కనిపిస్తుంది. భాషా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం తమిళం నుండి మొదట తెలుగు వేరుపడింది. ఆ తర్వాత కన్నడం మరియు మళయాలం కూడా వేర్వేరు భాషలుగా పరిణామం చెందాయి.

Dravidian Languages

ఈ “దూరం జరగడం” అంటే భాషలు ఇతర సంస్కృతులు, భాషలతో సంపర్కం పొంది, క్రమంగా మార్పులకు లోనై ప్రత్యేక భాషగా ఏర్పడటం. ఈ ప్రత్యేకతను మొట్టమొదటగా గుర్తించింది బిషప్ కాల్డ్వెల్. మన తెలుగు భాష ద్రవిడ భాష అని సమగ్రమైన ఆధారాలతో సహా నిరూపించిన ఘనత ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారికి దక్కుతుంది.

బ్రాహ్వీ చిక్కు: ద్రవిడ భాషల రహస్య వలస

ద్రవిడ భాషా కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భాషలన్నీ దాదాపు దక్షిణ , మధ్య భారతదేశంలో కేంద్రీకృతమై ఉంటే, ఒక్క బ్రాహ్వీ భాష మాత్రం ప్రస్తుత పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో (బలూచిస్తాన్‌లో) మాట్లాడబడుతోంది. దక్షిణాది భాషకు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భాషకు సంబంధం ఎలా ఏర్పడిందనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ చిక్కుముడిని విప్పడానికి అనేక పరిశోధనలు జరిగాయి.

Dravidian Languages

ఎడ్విన్ నోరిస్ (1853): ఈ భాషాశాస్త్రవేత్త పాకిస్తాన్‌లోని బ్రాహ్వీ భాషకు, ఒకప్పుడు ఇరాన్ దక్షిణ భాగంలో వెలుగొందిన ఎలుమ్ నాగరికత ప్రజలు మాట్లాడిన ఎలమైట్ భాషకు మధ్య సంబంధం ఉందని ప్రతిపాదించారు.

బిషప్ కాల్డ్వెల్: ఈ ప్రతిపాదనకు తగిన ఆధారాలను అందించారు.

డేవిడ్ మెక్కాల్పిన్ (1975): ఈయన తన పరిశోధనలో మరిన్ని వివరాలతో, ఉదాహరణలతో ఎలమైట్-ద్రావిడ భాషా కుటుంబ సంబంధాన్ని బలంగా నిరూపించారు.

ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే మొదట ఈ ద్రావిడ-ఎలమైట్ భాష మాట్లాడే ప్రజలు ఇరాన్ ప్రాంతం నుండి వచ్చి భారత ఉపఖండంలోని వాయువ్య భాగంలో స్థిరపడ్డారు. వీరే సింధూ నది పరివాహక ప్రాంతంలో వెలసిన సింధూ నాగరికత ప్రజలై ఉండవచ్చని ఒక ప్రధాన సిద్ధాంతం. తరువాత ఆర్యుల రాక వల్ల, ఈ ప్రజలు బలవంతంగా ముందుకు నెట్టబడ్డారు.

వారిలో కొందరు తూర్పు వైపు వెళ్లగా, అధిక సంఖ్యాకులు దక్షిణాది వైపు వలస పోయి చివరికి సముద్రం అడ్డు రావడంతో స్థిరపడ్డారు. కాలక్రమేణా గంగా-యమునా పరివాహకంలో ఆర్యులు స్థిరపడ్డాక, దక్షిణాది నుండి పెరిగిన ద్రావిడ జనాభా ప్రస్తుత ఆంధ్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు విస్తరించింది. ఈ విధంగా ద్రవిడ భాషా కుటుంబం యొక్క మూలాలు ఆఫ్రికా నుండి మధ్య ఆసియా మీదుగా వాయువ్య భారతంలోకి, చివరకు దక్షిణ భారతదేశంలోకి జరిగిన సుదీర్ఘ మానవ వలస కథను చెబుతున్నాయి.

కీలకడి: ఆధునిక పరిశోధనల మద్దతు

ఇటీవల తమిళనాడులోని కీలడి ప్రాంతంలో బయటపడిన పురాతన నాగరికతా అవశేషాలు, సింధూ నాగరికతను పోలిన లక్షణాలను కలిగి ఉండటం ఈ సిద్ధాంతాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

కీలడి తవ్వకాలు దక్షిణాది నాగరికత కూడా వేల సంవత్సరాల నాటిదనీ, ఇది ఉత్తరాది సింధూ నాగరికతతో ఏదో ఒక స్థాయిలో సంబంధం కలిగి ఉండేదనీ సూచిస్తున్నాయి. ఈ చారిత్రక, భాషా నేపథ్యాలు, మనం ‘దేశం’, ‘భాష’, ‘జాతి’ వంటి సరిహద్దులను పరస్పర విద్వేషానికి వాడుకోకుండా, మనమంతా చారిత్రక వలసల, సాంస్కృతిక సమ్మేళనాల ఫలితమేనని తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి.

– Siddharthi Subhas Chandrabose

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular