Donald Trump
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మూడోసారి(Third Time) అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. ఎన్బీసీ న్యూస్(NCB news)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ‘నేను జోక్ చేయడం లేదు, మూడో టర్మ్‌కు మార్గాలున్నాయి‘ అని పేర్కొన్న ట్రంప్, అయితే ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అని అన్నారు. ‘చాలా మంది నన్ను మూడోసారి ఎన్నుకోవాలని కోరుతున్నారు, కానీ ఇంకా సమయం ఉంది. నా దృష్టి ప్రస్తుత పరిస్థితులపైనే ఉంది‘ అని ఆయన తెలిపారు. మీడియా ప్రతినిధి ఒక ప్రత్యేక ప్రశ్న వేశారు: ‘జేడీ వాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికై, తర్వాత ఉపాధ్యక్షుడిగా ఉన్న మీకు బాధ్యతలు అప్పగిస్తే?‘ దీనికి ట్రంప్, ‘అది ఒక మార్గం. ఇంకా ఇతర మార్గాలూ ఉన్నాయి‘ అని సమాధానమిచ్చారు. అయితే, ఆ ఇతర మార్గాలు ఏమిటన్నది వెల్లడించలేదు. ‘నాకు పని చేయడం ఇష్టం‘ అని చెప్పి, ఈ చర్చకు మరింత ఊతమిచ్చారు.
Also Read : ఇరాన్ అణు భయం.. అమెరికాతో చర్చలకు ససేమిరా!
రాజ్యాంగ సవరణ..
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు. ట్రంప్ ఇప్పటికే 2017–2021లో ఒక టర్మ్ పూర్తి చేశారు, 2025లో రెండో టర్మ్‌ను ప్రారంభించారు. మూడో టర్మ్ కోసం రాజ్యాంగ సవరణ అవసరం, ఇది కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో లేదా 50 రాష్ట్రాల్లో 38 రాష్ట్రాల ఆమోదంతో సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది కాబట్టి, దాని సాధ్యత చాలా తక్కువ. ట్రంప్ అనుచరుడు స్టీవ్ బానన్ మాత్రం 2028లో ట్రంప్ మళ్లీ పోటీ చేసి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘దీనికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన వివరించారు, కానీ వాటిని స్పష్టంగా వెల్లడించలేదు.
సాంకేతికంగా అవకాశం..
ఒక వాదన ప్రకారం, ట్రంప్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి, అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేదా విషమ పరిస్థితుల్లో ఆ స్థానం చేపడితే సాంకేతికంగా అవకాశం ఉండవచ్చు. అయితే, 12వ సవరణ ఈ ఆలోచనను సందిగ్ధంలో పడేస్తుంది, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ట్రంప్ మూడో టర్మ్ అసాధ్యం. కానీ ఆయన వ్యాఖ్యలు, అనుచరుల ఆశాభావం ఈ చర్చను రాజకీయ వేదికపై జీవం పోస్తున్నాయి. ఇది రాజకీయ ఉత్సాహమా లేక వాస్తవంగా సాధ్యమయ్యే ఆలోచనా, అన్నది భవిష్యత్తు పరిణామాలే నిర్ధారిస్తాయి.
Also Read : ఏప్రిల్ 2న ఏం జరుగుతుంది.. ట్రంప్ అన్నంత పని చేస్తాడా?