Donald Trump: తదుపరి అమెరికా అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న డోనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. రహస్య పత్రాల ఒప్పందానికి సంబంధించి అవకతవకలు జరగడం, అవి వెనువెంటనే వెలుగులోకి రావడంతో ట్రంప్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు. సరిగ్గా 2 నెలల కిందట పోర్న్ స్టార్ స్మార్టీ డేనియల్స్‌తో అనైతిక ఒప్పందం కేసులో నేరాభియోగాలు ఎదుర్కొని కోర్టు విచారణకు హాజరై, అరెస్టు అనంతరం విడుదలైన ఆయన మీద తాజాగా రహస్య ప్రతాల కేసులో అభియోగాలు నమోదయ్యాయి. దీంతో మరోసారి ట్రంప్ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో ట్రంప్ కు సంబంధించిన కంపెనీ అభియోగాలు ఎదుర్కొంది. దీనిని మర్చిపోకముందే మరో వివాదంలో చిక్కుకున్నాడు. అది సద్దుమణుగుతున్న క్రమంలోనే మరో వివాదం వెలుగులోకి వచ్చింది.. వాస్తవానికి ఏప్రిల్ ప్రారంభంలో స్మార్టీ డేనియల్స్ కేసులో అరెస్టుతో.. అమెరికా చరిత్రలోనే అరెస్టయిన తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు ట్రంప్. ఇప్పుడు.. ప్రభుత్వ రహస్య పత్రాలను సొంత ఎస్టేట్‌కు తరలించిన కేసులో విచారణకు ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాలో అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ అభియోగాలు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, ట్రంప్ మీద ఫెడరల్ ప్రాసిక్యూషన్ అభియోగాలపై న్యాయ శాఖ నుంచి ధ్రువీకరణ రాలేదు. ట్రంప్ మాత్రం సొంత సోషల్ మీడియా ‘‘ట్రూత్’’లో ప్రకటించారు. దీనికిముందే ఆయన లాయర్లను ప్రాసిక్యూటర్లు సంప్రదించారని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
2020 చివర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 2021 జనవరిలో ఆయన పదవి నుంచి దిగిపోయారు. కాగా, ఆ సమయంలో ప్రభుత్వానికి చెందిన వందలకొద్దీ రహస్య పత్రాలను ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న సొంత ఎస్టేట్ మార్ ఎ లాగోకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తగినంత సమయం ఇవ్వకపోవడంతో వైట్‌హౌస్ ను హడావుడిగా వీడి వచ్చామని ఆ సందర్భంగా ఏమైనా డాక్యుమెంట్లు కలిసిపోయి ఉంటాయని ట్రంప్ బృందం వెల్లడించింది. అయితే, ఎస్టేట్ నుంచి పత్రాలను స్వాధీనం చేసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్- రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించింది. ట్రంప్ ఇవ్వడానికి మొండికేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో 2022 జనవరి, ఆగస్టుల్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మార్ ఎ లాగోలో తనిఖీలు చేసింది. మొదటిసారి 15 పెట్టెల్లో 184, రెండోసారి 20 పెట్టెల్లోని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మంగళవారం మియామిలోని ఫెడరల్ కోర్టుకు హాజరుకావాలని ట్రంప్‌ను కోరుతూ సమన్లు జారీ చేశారు. మొత్తం ఏడు క్రిమినల్ కౌంట్ల నేరారోపణలను ఆయనపై మోపారు.
ఎన్నికల్లో పోటీకి ఇబ్బందే?
ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన వెంటనే.. మళ్లీ పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ముందున్నారు. కానీ, ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలితే సుదీర్ఘ కాలం జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలను నిధుల సేకరణలో ఉన్న ట్రంప్.. అభియోగాలను ఖండించారు. ట్రంప్ పై వరుస అభియోగాలు నమోదు నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా పరువు తీస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు.. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ను ఉద్దేశిస్తూ విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. మరి ఈ కేసు నుంచి ట్రంప్ ఎలా బయటపడతారో వేచి చూడాల్సి ఉంది.