Pawan Kalyan: ఆంధ్రా సీఎం కావాలనే ఆకాంక్ష ఆశ పవన్ లో ఉందా? లేదా? అదే అడ్డంకి?

జనసేన టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందని అందరూ భావిస్తున్నా, ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నదే తన అభిమతమని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో వెల్లడించారు. కర్ణాటకలో కేవలం 30 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ నాయకుడు హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారని ఉదహరించారు.

Written By: SHAIK SADIQ, Updated On : May 12, 2023 10:59 am
Follow us on

Pawan Kalyan: చాపకింద నీరులా ప్రవహిస్తోన్న జనసేన ఏపీ రాజకీయాల్లో బలపడేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొని అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు బహిరంగ సభల్లో, మీడియా ముఖంగా వెల్లడించారు కూడా. ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వెళ్లే పార్టీలు రావాలని ఆయన పిలుపునిస్తున్నారు.

జనసేన టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందని అందరూ భావిస్తున్నా, ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నదే తన అభిమతమని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో వెల్లడించారు. కర్ణాటకలో కేవలం 30 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ నాయకుడు హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారని ఉదహరించారు. తనకు ఏపీ ప్రజలు 40 సీట్లు ఇస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు. ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానం గెలుచుకున్నారు. పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఏకంగా పార్టీ అధినేత ఓడిపోవడంతో జనసేన అథమ స్థానానికి వెళ్లిపోయింది. అశేష అభిమానులు ఉన్న పవన్ కల్యాణ్ అతికొద్ది సమయంలోనే పడి లేచిన కెరటంలా పుంజుకున్నారు. దాదాపు లక్ష మంది జన సైనికులు, వీర మహిళలు తమ పార్టీకి అండగా ఉన్నారని ఇటీవల జరిగిన ఆవిర్భావ సభలో ప్రకటించారు.

2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. 2019లో పోటీ చేసిన సందర్భంలో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్నామని అన్నారు. కూలంకషంగా విశ్లేషించిన తరువాత మొత్తంగా 7 శాతం ఓటు బ్యాంకు తనకు ఉందని నిర్థారణకు వచ్చామని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 20 నుంచి 30 శాతం ఓటు ఉందని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత పెరగవచ్చని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు.

పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మూడు సార్లు భేటీ అయ్యారు. కేంద్ర పెద్దల మాటను ఆయనకు వినిపించి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే, పవన్ మాట్లాడుతూ, పొత్తు పెట్టుకోవాలని బీజేపీ, టీడీపీలను అడగబోనని అన్నారు. కలిసి వెళ్లే పార్టీలు వస్తే తప్పక ఆహ్వానం అదిస్తామని పేర్కొన్నారు. దీనిని బట్టి రాబోవు ఎన్నికల్లో జనసేన కీలకంగా మారబోతున్నట్లు వపన్ నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు ఉన్నారు. వైఎస్సార్ పార్టీని రాష్ట్రంలో అంతమొందించడమే ధ్యేయంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్.. రాబోవు ఎన్నికల తరువాత కీ రోల్ ప్లే చేస్తారనడంలో సందేహం లేదు.