కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ ఉధృతంగా ఉన్నప్పుడు అన్ని రాష్ర్టాలు లాక్ డౌన్ విధించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకట్ట వేశాయి.అప్పటి నుంచే మూడో దశ ఉందని శాస్ర్తవేత్తలు చెబుతుండడంతో అందరిలో భయం పట్టుకుంది. ఎలాగైనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అందరు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై సర్కారు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
కరోనా గురించి అవగాహన ఉన్న వారే మాస్కులు ధరించడం, భౌతిక దూరం, నిబంధనలు పాటించడం వంటివి పెద్దవారే చేయడంలో బద్దకిస్తుండడంతో చిన్న పిల్లలు వాటిని ఎలా పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలిసి తెలియని వయసుల వారు ఇన్ని నిబంధనలు పాటిస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ వారితో చేయించడం ఉపాధ్యాయులకు కూడా ఓ పెద్ద సవాలే.
దేశవ్యాప్తంగా కరోనా భయపెడుతున్నా సర్కారు మాత్రం పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. స్కూళ్లు తెరవడంతో పిల్లల ఆరోగ్యం ఏమవుతుందనే విషయం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ నిర్ణయం సమంజసంగా లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సెకండ్ వేవ్ లోనే అందరు భయపడి ఆందోళన చెందగా మూడో వేవ్ ప్రత్యేకంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుందనే విషయం తెలుసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కొవిడ్ విషయంలో ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం లేదు. అప్రమత్తతే శ్రీరామరక్ష అని గుర్తించాలి. మూడో దశ ముప్పు గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నా సర్కారు ఎందుకు పెడచెవిన పెడుతుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వంటి రాష్ర్టం పాఠశాలలు తెరవాలని నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు.